151మంది ఒకవైపు... చంద్రబాబు ఒక్కరే ఒకవైపు...

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. అధికారపక్షం వైపు 151మంది ఎమ్మెల్యేలు ఉంటే... ప్రతిపక్షం వైపు 22మంది మాత్రమే ఉన్నారు. అయితే, ఈ 22మందిలోనూ సగమంది అసలు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంటున్నారు. కొందరైతే అసలు సభకే రావడం లేదు. కొంతమంది వచ్చినా ఏ మూలనో దూరంగా కూర్చుంటున్నారు. దాంతో, చంద్రబాబు దాదాపు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అధికారపక్షం అణ్వస్త్రాల్లాంటి బాంబులను విసురుతుంటే... వాటిని తట్టుకుంటూ ధీటుగా తిప్పికొడుతున్నారు. చంద్రబాబు అన్నట్లుగా పాతికేళ్ల యువకుడిలాగే 151మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కొంటున్నారు. అయితే అంతోఇంతో అచ్చెన్నాయుడు, రామానాయుడు మాత్రమే చంద్రబాబు సపోర్టుగా నిలబడుతున్నారు. గొంతు కలుపుతున్నారు. అయితే, అచ్చెన్నాయుడు, రామానాయుడుని కూడా అధికారపక్షం దాదాపు నియంత్రిస్తుండటంతో... చంద్రబాబు ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు. అందుకే 50 మంది కాదు... 150మంది ఒకేసారి వచ్చినా తాను ఎదుర్కోగలనంటూ పంచ్ డైలాగులు విసరడమే కాకుండా, తన సామర్ధ్యాన్ని అధికారపక్షానికి రుచిచూపిస్తున్నారు చంద్రబాబు.

అయితే, అధికారపక్షం చంద్రబాబునే టార్గెట్ చేయడం... మాటలతో కించపర్చుతుంటే... వాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఒంటరి పోరాటం చేస్తున్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనపైనా, తనయుడు లోకేష్ పైనా విమర్శలు చేస్తుంటే... ఎప్పటికప్పుడు చంద్రబాబు లేచి తిప్పికొట్టాల్సి వస్తోంది. ప్రతిదానికీ చంద్రబాబే లేవాల్సి వస్తోంది. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరిలు బాబుకి తోడుగా చెలరేగానికి ట్రై చేస్తున్నా... వైసీపీ నేతల దాడిని సమర్ధంగా తిప్పికొట్టలేకపోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు మాట్లాడకుండా అధికారపక్షం కంట్రోల్ చేస్తోంది. ఒకవేళ లేచినా, మాటలతో కించపరుస్తూ కూర్చునేలా చేస్తున్నారు. దాంతో, అధికారపక్షాన్ని ధాటిగా ఎదుర్కొనేందుకు వాగ్ధాటి కలిగిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకి కరవయ్యారనే మాట వినిపిస్తోంది.

ఇక, వల్లభనేని వంశీ... టీడీపీ నుంచి వేరుపడి ప్రత్యేక సీటును దక్కించుకున్నారు. మిగతా 22మంది ఎమ్మెల్యేల్లో సగం మంది పక్క చూపులు చూస్తుండటంతోనే చంద్రబాబుతో కలిసి ధాటిగా అధికారపక్షంపై విరుచుకుపడటం లేదని అంటున్నారు. అయితే, తన వెనుక ఎంతమంది ఉన్నారనేది పట్టించుకోని చంద్రబాబు వన్ మేన్ ఆర్మీలాగా అధికారపక్షంపై పోరాడుతున్నారు.