ఆనాడు ఎన్టీఆర్..ఈనాడు చంద్రబాబు

 

తెలుగు చలన చిత్ర రంగంలో నందమూరి తారక రామారావు పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అలానే తమిళనాట అంతే గొప్ప పేరు ఉన్న నటుడు ఎం.జీ.రామచంద్రన్ (ఎంజీఆర్).ఇద్దరు సినీరంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు.ఎంజీఆర్ తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ స్థాపిస్తే,ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ స్థాపించారు.రాష్ట్రాలు వేరైనా సమన్వయంతో,స్నేహబంధంతో మెలిగేవారు.అలానే డీఎంకే పార్టీ కూడా తెదేపాకు తమ మద్దతునిచ్చేది.తమిళనాడులో  అన్నాడీఎంకే, డీఎంకేలలో ఏది అధికారంలో ఉన్నా తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చేవి.ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబు నాయుడుకు జయలలిత, కరుణానిధితో మంచి సంబంధాలు ఉండేవి. ఎవరు ఎన్నికల్లో గెలుపొందినా తప్పకుండా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేవారు.కానీ జయ మరణాంతరం తెదేపాకు అన్నాడీఎంకే నుంచి ప్రాధాన్యత తగ్గిపోయింది.ఆ పార్టీ నేతలతో సమావేశమవ్వటానికి వచ్చిన తెదేపా ఎంపీలకు సమయం ఇవ్వకపోవటమే పార్టీల మధ్య దూరం పెరిగిందంటానికి ఉదాహరణ.అయితే డీఎంకే మాత్రం కరుణానిధి మరణం తర్వాత కూడా తెదేపాకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.

 

 

ప్రస్తుతం చంద్రబాబు బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయటానికి సన్నద్ధమైన సంగతి తెలిసిందే.అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలో భేటీ అయ్యారు.అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సైతం భేటీ అయ్యారు.ఈ పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు తన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారనే చెప్పుకోవాలి.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగా నిన్న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఇతర నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.నేడు తెదేపాకు మొదటి నుంచి సన్నిహిత పార్టీ అయిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తో సమావేశమవనున్నారు.బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతు తెలుపమని చంద్రబాబు స్టాలిన్‌ ను కోరే అవకాశం ఉంది.ఎలాగో స్నేహబంధం ఉంది కాబట్టి  స్టాలిన్‌ కూడా అందుకు సానుకూలంగా ఉంటారనే అనుకోవాలి.అంతబాగానే ఉంది కానీ ఇంతకీ చంద్రబాబు అన్నాడీఎంకే పార్టీ నేతలతో సమావేశమవుతారా? లేదా? అనేదే ప్రస్నార్ధకం.అన్నాడీఎంకే కూడా గత కొంత కాలంగా బీజేపీ కి కాస్త అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.