కర్నూలులో చంద్రబాబు పర్యటన... నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతానికి సమీక్షలు

టిడిపి అధినేత చంద్రబాబు ఈ రోజు ( డిసెంబర్ 2వ తేదీ ) నుండి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలోనే ఉండి నియోజకవర్గాల వారీగా పార్టీ పై సమీక్ష నిర్వహించనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టిడిపి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి సారిగా టిడిపి అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. మూడురోజుల పాటు జిల్లాలోనే బస చేసి పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న సమయంలో చంద్రబాబు రాక పార్టీ నేతలు.. కార్యకర్తల్లో.. నూతనోత్సాహాన్ని నింపుతుంది. పర్యటనలో భాగంగా నేడు కర్నూలులోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్ లో ఉదయం 11 గంటలకు చంద్రబాబు పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం 11:15 నిమిషాలకు పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్ నందికొట్కూరు, నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి గురుంచి సమీక్ష నిర్వహిస్తారు.

రాత్రి అక్కడే బస చేసి రెండో రోజున ఉదయం పది గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం వైసిపి బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఉదయం 11 నుంచి ఆళ్ళగడ్డ కోడుమూరు నియోజక వర్గాల నాయకులు కార్యకర్తలతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం ఆలూరు, పత్తికొండ, నంద్యాల నియోజక వర్గాల వారీగా సమీక్షలు జరుపుతారు. మూడో రోజు బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం నియోజక వర్గాల పై సమీక్ష నిర్వహించటానికి బాబు సిద్ధమయ్యారు. మూడు రోజుల పర్యటన పై ఇప్పటికే పార్టీ శ్రేణులు కార్యక్రమాలను సిద్ధం చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇతర నాయకుల ఆధ్వర్యంలో టోల్ గేట్ నుంచి సభా వేదిక వరకు భారీ ర్యాలీతో ఆహ్వానం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చంద్రబాబు పర్యటన జిల్లా నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందనే చెప్పుకోవాలి.