మోదీ పేరెత్తితేనే వైసీపీ నేతలకు వెన్నులో వణుకు

 

అనంతపురంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు బైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ఒకే దెబ్బకు రెండు కాదు మూడు పిట్టలు అన్నట్టుగా.. ఒకేసారి మోదీ, జగన్, పవన్ ల మీద విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాను కరవు నుంచి దూరం చేసేందుకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే లక్ష నీటి కుంటలు పూర్తి చేయడం, 5లక్షల ఎకరాలకు బిందు, తుంపర సేద్య పరికరాలు అందించామని చెప్పారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలోకి తీసుకురావాలని తాము ఎంతో కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు.రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో అభివృద్ధి నిమిత్తం విడుదల చేసిన నిధులను సైతం కేంద్రం వెనక్కి తీసుకుందని.. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీ నేతలకు కేసుల నుంచి బయటపడటంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని, కేంద్రాన్ని విమర్శించడం మానేసి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మోదీ పేరెత్తితేనే వైసీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ఉప ఎన్నికలు రాకుండా అన్నీ ఆలోచించిన తర్వాతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో తమకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు మోదీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. జనసేన ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేసిన పవన్‌.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని తేల్చారని.. కానీ ఇప్పుడు ఆ నివేదిక ఊసే ఎత్తడం లేదన్నారు.

తాము బీజేపీతో విభేదించక ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని తెరాస నేతలు కూడా డిమాండ్‌ చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎప్పుడైతే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుంచి బీజేపీ నేతలు రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మహాకూటమిలో చేరితే అందుకు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.