పనిచేయలేని మంత్రులకి టీసీలు ఇచ్చేస్తా: చంద్రబాబు

 

నిన్న జరిగిన మంత్రివర్గసమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులను సున్నితంగా హెచ్చరించారు. ఎంత బాగా చదివినప్పటికీ పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోతే ప్రయోజనం ఉండనట్లే మంత్రుల పనితీరుకి ప్రజల ఆమోదం లభించకపోతే ఎటువంటి ఉపయోగమూ ఉండదని అన్నారు. అటువంటి మంత్రులకు టీసీలు ఇచ్చి పంపించవలసి వస్తుందని ఆయన తన మంత్రులను హెచ్చరించారు. “మంత్రులు తాము చాలా బాగా పనిచేస్తున్నామనుకోవచ్చును, గానీ ప్రజలు కూడా ఆవిధంగా భావించినప్పుడే దానికర్ధం ఉంటుందని” ఆయన అన్నారు. మంత్రులు తమ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకొంటూ, మరింత మెరుగుపరుచుకోవాలని లేకుంటే తొలగించవలసి వస్తుందని చంద్రబాబు నాయుడు రెండవ మంత్రివర్గ సమావేశం నుండే మంత్రులందరినీ హెచ్చరిస్తున్నారు. కానీ రాష్ట్రంలో తెదేపా అధికారం వచ్చే వరకు ఎంతో శ్రమించిన పార్టీ నేతలందరూ, అధికారంలోకి వచ్చిన తరువాత ‘విశ్రాంతి-మోడ్’ లోకి వెళ్లిపోయారని చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే మంత్రులలో మునుపటి పట్టుదల, ఉత్సాహం కొరవడ్డాయని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మళ్ళీ నిన్న మంత్రులకు టీసీలు ఇచ్చి పంపించేస్తానని ఆయన సున్నితంగా చేసిన హెచ్చరికను మంత్రులందరూ సీరియస్ గా తీసుకోకపోతే ఏదో ఒకరోజున ఆయన మంత్రివర్గ ప్రక్షాళన చేసి తన హెచ్చరికలను పట్టించుకోని మంత్రులను ఇంటికి పంపడం తధ్యంగా కనిపిస్తోంది.

 

రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలను కూడా పునరంకితం చేసేందుకు జూన్ 2నుండి 8వరకు వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించాలని నిన్న మంత్రివర్గం నిర్ణయించింది. కానీ అంతకంటే ముందు మంత్రులు అందరూ కూడా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరికలను బట్టి అర్ధమవుతోంది.