విశాఖ ఆర్థిక రాజధానిగా నిలబడుతుంది: చంద్రబాబు

 

విశాఖ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. విశాఖపట్నం మళ్ళీ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా నిలబడుతుందన్న నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ‘‘తుఫాను బాధితులకు రేషన్ దుకాణాలలో ఆరు రకాల సరుకులు అందుబాటులో వుంచాం. ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో చక్కెర, కిలో ఉప్పు, లీడర్ పామాయిల్, అరకిలో కారం పంపిణీ చేయనున్నాం. సాయంత్రంలోగా అన్ని రేషన్ దుకాణాలకు బియ్యం చేరాలని ఆదేశించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందుతుంది. తుఫాను వీడియోలను, ఫొటోలను తీసిన వ్యక్తులు హుదుద్ పేరిట ఏర్పాటు చేసిన పోర్టల్‌కు పంపించాలి. విశాఖ ప్రజలు చాలా మంచివారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సుహృద్భావంతో స్వీకరించి సహకరిస్తున్నారు. టెలికం కంపెనీలు బాధితులకు 50 రూపాయల టాక్‌టైమ్‌తోపాటు ఉచిత రోమింగ్ టైమ్ సేవలు అందించాయి. నష్టపోయిన పరిశ్రమలకు బీమా కంపెనీలు వెంటనే పరిహారం అందించాలి. ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలను అభినందించాల్సిన ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేయడం దారుణం. సహాయ కార్యక్రమాల్లో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయనున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.