జగన్... ఎన్డీఏలో చేరితే... బాబు నెత్తిపై పాలు పోసినట్లే..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు అనేక కారణాలు వినబడుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ, మండలి రద్దు, హైకోర్టు తరలింపు, రాష్ట్ర సమస్యలు, పెండింగ్ నిధులు, గ్రాంట్లు కోసమే ప్రధాని మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఇతర కేంద్ర మంత్రులను జగన్ కలిశారని అంటున్నా... అంతకంటే, ముఖ్యమైన రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. ఎన్డీఏలో వైసీపీ చేరబోతోందని, అలాగే, కేంద్ర కేబినెట్లోకి వైసీపీ తీసుకోబోతున్నారనేది ఆ ప్రచారం యొక్క సారాంశం. అయితే, ఎన్డీఏలో వైసీపీ చేరుతుందనే ప్రచారమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణాలు క్షణాల్లో మారిపోవడం ఖాయమంటున్నారు.

వైసీపీ... ఎన్డీఏలో చేరి, కేబినెట్ బెర్తులు తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు జరిగే అవకాశముంది. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి కొన్ని లాభాలున్నా.... రాజకీయంగా మాత్రం కొన్ని బలమైన వర్గాలు వైసీపీకి దూరమయ్యే అవకాశాలు మొండుగా ఉన్నాయి. వ్యక్తిగతంగా చూస్తే... కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరడం ద్వారా జగన్ అండ్ విజయసాయిరెడ్డిపై ఉన్న సీబీఐ అండ్ ఈడీ కేసులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కేసుల విషయంలో కొంత ఊరట కలుగొచ్చు. ఇక, టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణను వేగవంతం చేసే అవకాశముంది. అలాగే, టీడీపీ హయాంలో అవినీతి జరిగిందంటున్న వైసీపీ....కేంద్ర ప్రభుత్వంతో కలిసి దూకుడుగా ముందుకెళ్లే ఛాన్సుంటుంది.

అయితే, ఎన్డీఏ అండ్ కేంద్ర కేబినెట్లో చేరడం ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాలు వైసీపీకి దూరమయ్యే అవకాశముంది. ఎందుకంటే, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లిం అండ్ క్రిస్టియన్ వర్గాలు... వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ వర్గాలు తెలుగుదేశం వైపు చూసే అవకాశముంటుంది. అంతేకాదు, వైసీపీలోని ముస్లిం ప్రజాప్రతినిధులు, నాయకులు ఇరకాటంలో పడతారు. తమ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, నిధుల విషయంలో వైసీపీ రాజీపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కొమ్ముకాసిన ఓటర్లు దూరమయ్యే అవకాశం కచ్చితంగా ఉంటుంది. 

ఎన్డీఏ అండ్ కేంద్రంలోకి వైసీపీని ఆహ్వానిస్తే, బీజేపీకి కూడా నష్టాలు ఉంటాయ్. వైసీపీ మిత్రపక్షమైతే... ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీకి... ఏపీలో ద్వారాలు మూసుకుపోతాయి. అంతేకాదు, ఏపీలో కలిసి పనిచేసేందుకు అవగాహన కుదుర్చుకుని ముందుకెళ్తున్న జనసేన-బీజేపీ బంధానికి బ్రేకులు పడొచ్చు. వీటన్నింటినీ మించి, రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళన గురించి మాట్లాడే నరేంద్రమోడీ విశ్వసనీయతకు మచ్చ వచ్చే అవకాశముంటుంది. విపక్షాలకు ఒక ఆయుధాన్ని అందించినట్లవుతుంది.