తప్పుడు డబ్బులతో తాము పేపర్లు, ఛానల్స్ పెట్టలేదు.. జగన్ పై బాబు ఫైర్!!

ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంగ్లిష్‌ మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదని బాబు స్పష్టం చేశారు. జగన్‌ వల్లే ఇంగ్లీష్ మీడియం వచ్చిందనడం సరికాదని అన్నారు. గతంలో మున్సిపల్ పాఠశాలల్లో తమ హయాంలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేసారు. మీరే ఇంగ్లిష్‌ను కనిపెట్టినట్టు మాట్లాడొద్దని ఎద్దేవా చేసారు. తాము మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ను ప్రవేశపెడితే మీరు వ్యతిరేకించలేదా అని బాబు ప్రశ్నించారు. అంతేకాదు, మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సందర్భంలో సాక్షి పత్రికలో వచ్చిన వ్యతిరేక కథనాలను బాబు చదివి వినిపించారు. ఇంగ్లీష్ పై రెండు నాలుకల ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని.. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు. 

చంద్రబాబు మాటలు.. వైసీపీకి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా సీఎం జగన్ అసహనానికి గురయ్యారు. సాక్షిలో ఏం రాశారో చర్చించడానికి అసెంబ్లీ లేదని.. మీరేం చేశారో, నేనేం చేశానో చర్చిద్దామని చెప్పారు. అసలు తాను ఏనాడు ఇంగ్లీష్ ని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ ను వ్యతిరేకించానని మీరు నిరూపించగలరా అని సవాల్ చేశారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే… నేను ఇంగ్లీష్ ను వ్యతిరేకించినట్టు నిరూపించమని జగన్ సవాల్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్‌కు మేలు చేయడం కోసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల విధానాన్ని భ్రష్టు పట్టించిన మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలని బాబుని ఉద్దేశించి జగన్ కామెంట్స్ చేశారు.
 
జగన్ వ్యాఖ్యలపై స్పందించిన బాబు.. తాను సిగ్గుతో తలంచుకోవడం కాదని, జగన్ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసిందని ప్రజలకు క్షమాపణ చెప్పి, తాను మోసం చేయలేదని జగన్ చెప్పుకోవాలని బాబు అన్నారు. సాక్షిలో రాస్తే తనకు సంబంధం లేదనట్టుగా జగన్ మాట్లాడుతున్నారని బాబు ఎద్దేవా చేసారు. ఈ సమయంలో అసహనానికి గురైన జగన్.. ఈ మనిషికి ఏమన్నా బుద్ధి, జ్ఞానం ఉందా అని బాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసారు. సాక్షి అనేది ఒక మీడియా వ్యవస్థ అని, ఎవరి అనుకూల ఛానల్స్, పేపర్స్ వాళ్లకుంటాయని.. వాటిలో రాసినవి తీసుకొచ్చి మాట్లాడితే ఎలా కుదురుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బాబు స్పందిస్తూ.. మీ పేపర్‌కు విశ్వసనీయత లేదా? అని ప్రశ్నించారు. మీ పేపర్ ఒక చెత్త పేపర్ అని బాబు ఫైర్ అయ్యారు. తనను బుద్ధి, జ్ఞానం లేదని సీఎం అన్నారని.. మరి సాక్షికి బుద్ధి, జ్ఞానం ఉందా? అని నిలదీశారు. తప్పుడు డబ్బులతో తాము పేపర్లు, ఛానల్స్ పెట్టలేదని బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.