నేనేం నేరాలు చేసి జైలుకి వెళ్ళలేదు.. జగన్ పై బాబు ఫైర్

అసంబ్లీలోకి వెళ్లకుండా టీడీపీ అధినేత చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్నా పట్టువీడని విక్రమార్కుడిలా ఆయన లోపలికి వెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా ముందుకు వెళ్తూ ప్రజల కోసం నిరంతరం పోరాడతామని బాబు స్పష్టం చేసారు. ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవించే పరిపాలన ఉండాలే కానీ ఒక ఉన్మాది పరిపాలనలాగా ఉండకూడదని బాబు మండిపడ్డారు. తనని అసెంబ్లీలోకి ఎందుకు అనుమతించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్ నాన్సెన్స్ అని తప్ప తాను తప్పుగా మాట్లాడలేదని.. తనకు లోపలికి వచ్చే హక్కు లేదా అని గట్టిగా నిలదీశాను తప్ప ఇంకోటి కాదన్నారు బాబు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బాబు వెల్లడించారు. తనకు పౌరుషంగా మాట్లాడం తెలుసని.. నేరాలు చేసి జైలుకు వెళ్లడాలు తెలియదని.. అలాంటివి తమకు అలవాటు లేదని బాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం కోసం తానూ జీవితాంతం పని చేశానని చెప్పుకొచ్చారు. తాను గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం కానీ.. లోపలకు రానివ్వకుండా అడ్డుపడి లోపలికి రానివ్వకపోతే ఎవరికయినా బాధ ఉంటుందని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అసెంబ్లీలోకి రానివ్వకుండా చేస్తున్నారనే బాధ ఎవరికైనా ఉంటుందని.. అందుకే గట్టిగా చెప్పాను తప్ప మరొకటి లేదని బాబు తెలియజేసారు.