విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబును వెనక్కి పంపిన పోలీసులు.. జగన్ ప్రతీకారం తీర్చుకున్నారా?

విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రజా చైతన్య యాత్రతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు బలవంతంగా ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి పంపారు. విజయవాడకు వెళ్లేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లే విమానంలో ఆయన్ను ఎక్కించి పంపారు. అంతకు ముందు ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబును అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. విజయనగరం వెళ్లేందుకు పోలీసుల నుంచి మందస్తు అనుమతి ఉన్నా వైసీపీ కార్యకర్తల నిరసనలతో చంద్రబాబు కాన్వాయ్ ఎయిర్ పోర్టు దాటి వెళ్లలేకపోయింది. టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడులకు దిగడంతో విశాఖ ఎయిర్ పోర్టులో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతిపజేశారు.

నాలుగు గంటల హైడ్రామా తర్వాత ఎయిర్ పోర్టు బయటికి వచ్చిన చంద్రబాబు టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. విజయనగరం వెళ్లేందుకు అనుమతి తీసుకున్నా తనను ఎందుకు అడ్డుకున్నారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గంటసేపు నిరసన తర్వాత పోలీసులు సెక్షన్ 151 ప్రకారం చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో చంద్రబాబు సహా మిగతా టీడీపీ నేతలను సైతం ముందస్తు అరెస్టు చేశారు. చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్ లోకి తీసుకెళ్లిన పోలీసులు వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. చంద్రబాబు ససేమిరా అనడంతో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి పోలీసులు చంద్రబాబును నచ్చజెప్పి వెనక్కి పంపించేందుకు సిద్దమయ్యారు. కానీ విశాఖ నుంచి విజయవాడ విమానాశ్రయానికి నేరుగా వెళ్లే ఫ్లైట్లు లేకపోవడంతో హైదరాబాద్ విమానం ఎక్కించి పంపించేశారు.

తాజా పరిణామాలతో 2017లో ప్రత్యేక హోదా ఉద్యమం కోసం విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం తనను వెనక్కి పంపిన నేపథ్యంలో సీఎం జగన్ అందుకు ప్రతీకారగా ఇప్పుడు చంద్రబాబును వెనక్కి పంపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతోనే చంద్రబాబును వెనక్కి పంపినట్లు చెబుతోంది.