చంద్రబాబు గారూ.. సీఎం రమేష్‌ని కంట్రోల్ చేయండి

 

 

 

తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ నాయకుడు సీఎం రమేష్ పెద్ద సమస్యగా మారారని తెలుగుదేశం నాయకులే ఆరోపిస్తున్నారు. సీఎం రమేష్‌ని నమ్మిన తెలుగుదేశాధినేత చంద్రబాబు ఆయన్ని తన కోటరీలో చేర్చుకుంటే సీఎం రమేష్ తనకు లభించిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. చంద్రబాబుతో సన్నిహితంగా వుండే అవకాశాన్ని పార్టీని బలోపేతం చేయడానికి కాకుండా పార్టీని మరింత బలహీనపరచడానికి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు పార్టీలో వినిపిస్తున్నాయి.

 

సీమాంధ్రలోని అనేక  నియోజకవర్గాలలో పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన అనేకమంది నాయకులకు టిక్కెట్లు రాకుండా చేసి, బయటి నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు వచ్చేలా చేశారన్న ఆరోపణలు కూడా సీఎం రమేష్ మీద వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలలో ఓడిపోయే అభ్యర్థులను తెలుగుదేశం నిలబెట్టడానికి కూడా ఆయన కారణమని అంటున్నారు. చాలామంది తెలుగుదేశం రెబల్స్ గా పోటీ చేయడానికి సీఎం రమేష్ అనుసరించిన విధానాలే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


ఇప్పటి వరకూ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న ఈ అభిప్రాయాలు తాజాగా బహిర్గతమయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డికి ఈసారి టిక్కెట్ రాకపోవడానికి సీఎం రమేష్ ప్రధాన కారణమని ఆయన అనుయాయులు ఆరోపిస్తున్నారు. తనకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో కనుక్కోవడానికి లింగారెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లింగారెడ్డి వర్గీయులు సీఎం రమేష్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇంతకాలం పార్టీలోనే వున్న గుట్టు రట్టయింది.


ఇప్పటికైనా చంద్రబాబు సీఎం రమేష్‌ని అదుపులో పెట్టి పార్టీని కాపాడాలని పలువురు నాయకులు చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రాజ్యసభలో సీఎం రమేష్ తెలుగువారి పరువు పోయేలా ప్రవర్తించిన విషయాన్ని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.