తెలంగాణా కోసం చంద్రబాబు సరికొత్త వ్యూహం

 

రాష్ట్ర విభజన దెబ్బకి తెలంగాణాలో డీలాపడిపోయిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రయోగించిన బీసీ మంత్రంతో మళ్ళీ బలం పుంజుకొంది. ఇటీవల ఆయన వేసిన రెండు తెలంగాణా కమిటీలలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా బీసీ వ్యక్తినే తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన హామీతో ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాసలు రెండూ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు మరో సరికొత్త వ్యూహంతో పార్టీని మరింత బలోపేతం చేసి, అధికారం కైవసం చేసుకొనేందుకు సిద్దమవుతున్నారు.

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణా పోరాటంలో తనకు అండగా నిలబడి పోరాడిన ఉద్యమకారులకు టికెట్స్ నిరాకరించడంతో వారు ఆయనపై ఆగ్రహంగా ఉన్న సంగతిని గమనించిన చంద్రబాబు, వారిలో యువకులు, ఉన్నత విద్యావంతులు, తెలంగాణా పునర్నిర్మాణం పట్ల నిబద్దత కలవారు ముఖ్యంగా బీసీ వ్యక్తులను గుర్తించి పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

ఈ మధ్యనే హన్మకొండకు చెందిన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) వర్కింగ్ కమిటీ చైర్మన్ చిల్లా రమేష్‌తో పాటు మరికొంత మంది చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉన్నత విద్యావంతుడు, ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న యువకుడు అయిన రమేష్ ముదిరాజ్ కులానికి చెందినవారు. ఆయనను బీసీలు అధికంగా ఉన్న వరంగల్ జిల్లా తూర్పు అసెంబ్లీ స్థానం నుండి పోటీలో నిలిపేందుకు చంద్రబాబు సంసిద్దంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న బీసీ కులాలకు చెందిన మరికొందరు యువకులతో చంద్రబాబు తన అనుచరుల ద్వారా సంప్రదిస్తున్నట్లు తాజా సమాచారం.

 

తెలంగాణా ప్రజలకు సుపరిచితులయిన ఉద్యమకారులనే పార్టీ టికెట్స్ కేటాయించి ఎన్నికల బరిలో దింపినట్లయితే, కాంగ్రెస్, తెరాసలకు చెక్ పెట్టడమే కాకుండా, ప్రజలకు తెదేపా పట్ల నమ్మకం కలిగించవచ్చును. చంద్రబాబు ప్రయత్నాలు ఫలించినట్లయితే, ఇంతవరకు తెలంగాణాలో తమకు తిరుగేలేదని భావిస్తున్న తెరాస, కాంగ్రెస్ పార్టీలు తెదేపా అభ్యర్ధులను ఓడించేందుకు చెమటోడ్చవలసి రావచ్చును. నిన్న మొన్న వరకు తమతో కలిసి పనిచేసిన తెలంగాణా ఉద్యమకారులకు వ్యతిరేఖంగా ఆ రెండు పార్టీలు మాట్లాడటం కూడా కష్టమే అవుతుంది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వారిపై విమర్శలు గుప్పిస్తే అవి ప్రజలలో ఆ రెండు పార్టీల పట్ల వ్యతిరేఖతను పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల చంద్రబాబు ప్రయోగిస్తున్న ఈ రెండో బ్రహ్మాస్త్రం మొదటి దానికంటే చాలా ప్రమాదకరమయినదని ఒప్పుకోక తప్పదు.