టీఆర్ఎస్ హార్ట్ లో స్టోన్!

 

టీఆర్ఎస్ హార్ట్ లో స్టోన్ పడింది. ఆ స్టోన్ కూడా అంతా ఇంతా స్టోన్ కాదు.. చాలా భారీ స్టోన్. ఆ స్టోన్ పేరు ‘తెలుగుదేశం’. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ వుంటుందని భ్రమపడిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమ భ్రమలు తొలగించుకుని వాస్తవాన్ని దర్శిస్తున్నారు. అటు సీమాంధ్రతోపాటు ఇటు తెలంగాణలో కూడా తెలుగుదేశం చాలా స్ట్రాంగ్‌గా వుందన్న సత్యాన్ని తెలుసుకుంటున్నారు.

 

రాష్ట్ర విభజన జరిగిపోయింది కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం ప్రభావం వుండదని టీఆర్ఎస్ నాయకులు శక్తివంచన లేకుండా ప్రచారం చేశారు. తెలంగాణలో బలంగా వున్న తెలుగుదేశం నాయకులందరికీ టీఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వానాలు పంపారు. అయితే ఏదో కొద్దిమంది నాయకులు తప్ప ఎవరూ టీఆర్ఎస్ వైపు వెళ్ళలేదు. టీడీపీకి వున్న కార్యకర్తల కోటలో ఒక్క ఇటుకని కూడా టీఆర్ఎస్ కదల్చలేకపోయింది. దీనితోపాటు తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తానని, తెలంగాణ బీసీలకు తెలుగుదేశం పార్టీని కానుకగా ఇస్తున్నానని చంద్రబాబు ప్రకటించడం, బీసీలను గౌరవించే విధంగా కార్యవర్గాన్ని ప్రకటించడం తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీద వున్న గౌరవం పెరిగేలాచేసింది.

 

తెలంగాణ రాకముందు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడని ప్రకటించి, తీరా తెలంగాణ వచ్చాక దళితుల నెత్తిన చెయ్యి పెట్టిన కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నతుడన్న అభిప్రాయం తెలంగాణ ప్రాంతంలో వ్యక్తమవుతోంది. మంగళవారం నాడు మహబూబ్‌నగర్‌లో చంద్రబాబు నిర్వహించిన పాలమూరు ప్రజా గర్జన కార్యక్రమాన్ని చూసి అటు టీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ నాయకుల గుండెల్లోకూడా రాళ్ళు పడ్డాయి.

 

చంద్రబాబు సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరు కావడం, చంద్రబాబు ప్రసంగానికి విశేష స్పందన లభించడం రెండు పార్టీల నాయకులకు కంటి నిండా నిద్ర లేకుండా చేశాయి. ప్రస్తుత ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తెలుగుదేశం పార్టీలో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.