జూన్ 8న చంద్రబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం?

 

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయం దగ్గరపడుతున్న కొద్దీ, ఆయనతో బాటు ఎంతమంది, ఎవరెవరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు? అనే అంశంపై మీడియాలో చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి.

 

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశం నలుమూలల నుండి అనేక మంది ప్రముఖులు రాబోతున్నందున, వారి భద్రత దృష్ట్యా కేవలం చంద్రబాబు ఒక్కరే జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, జూన్ 9 లేదా 10వ తేదీలలో మిగిలినవారు హైదరాబాదులో గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు మంత్రివర్గంలో చేరబోయేవారు, తాము కూడా ఆయనలాగే దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రముఖులు, లక్షలాది ప్రజల సమక్షంలో ప్రమాణస్వీకారం చేయాలని కోరుకోవడం సహజమే గనుక జూన్ 8న చంద్రబాబుతో బాటు మిగిలినవారు కూడా ప్రమాణస్వీకారం చేయవచ్చును. అయితే చంద్రబాబు మంత్రివర్గంలో ఎంతమంది ఉండబోతున్నారు? ఎవరెవరికి మంత్రులుగా అవకాశం దక్కబోతోంది? అనే విషయాలపై మరో రెండు మూడు రోజులు సస్పెన్స్ కొనసాగవచ్చును. బహుశః జూన్ 8 ఉదయం చంద్రబాబు మంత్రివర్గం సభ్యుల పేర్ల జాబితాను గవర్నర్ కు పంపినప్పుడు ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది.