చంద్రబాబు బ్రహ్మాస్త్రం తెరాసకి తగిలినట్లేనా?

 

తెదేపా నేతలను తెరాసలోకి వలసలు వచ్చేలా ప్రోత్సహిస్తూ ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేసామని భావిస్తున్న తెరాసకు నిన్న మెహబూబ్ నగర్లో తెలుగుదేశం నిర్వహించిన ప్రజాగర్జన విజయవంతం అవడంతో కంగారు మొదలయింది. అది తెరాస నేత హరీష్ రావు మాటలలో స్పష్టంగా వ్యక్తమయింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ “చంద్రబాబు బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఆయన ఆ పదవేదో ఆంధ్రాలోనే ఇచ్చుకొని, దైర్యం ఉంటే తెలంగాణాలో పోటీచేసి గెలవగాలరా అని ప్రశ్నిస్తున్నాము. మేము దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు తగ్గామని తెదేపా ఒట్టొట్టి ప్రచారం చేస్తోంది. కానీ మేము నేటికీ మా హామీపై వెనక్కు తగ్గలేదు. మాకు ఇక ఆంధ్రా పార్టీల పెత్తనం అవసరం లేదు. ఈ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించి మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యం,” అని అన్నారు.

 

చంద్రబాబు చెపుతునట్లు బీసీ ముఖ్యమంత్రి ఐడియా తెరాసపై బ్రహామాస్త్రంలా పనిచేసిందని హరీష్ రావు మాటలే స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఆయన తాము దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు పోలేదని చెపుతున్నారు. కానీ మూడు రోజుల క్రితమే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిపై తాను హామీ ఇచ్చిన పరిస్థితులు లేవని, తానే ఆ పదవి చెప్పట్టవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. మరి ఇప్పుడు హరీష్ రావు దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు తగ్గలేదని చెప్పడానికి అర్ధం తెరాస ఆలోచనలో మళ్ళీ మార్పు వచ్చిందనా లేక తనను పక్కన బెట్టి కొడుకు కేటీర్ ని ముందుకు తీసుకువెళుతున్న కేసీఆర్ ని ఇరుకున పెట్టె ప్రయత్నంలో అన్నమాటనుకోవాలా?

 

చంద్రబాబుని తెలంగాణాలో పోటీ చేయమనడం, ఆయన ముఖ్యమంత్రి అవుదామనుకొంటున్న ఆంధ్రాలో బీసీని ముఖ్యమంత్రిగా చేయమని హరీష్ రావు డిమాండ్ చేయడం దేనికంటే, బీసీ ముఖ్యమంత్రి అంశంతో తమకు అగ్నిపరీక్ష పెడుతున్న చంద్రబాబుని కూడా అదే విధంగా ఇరుకున పెడదామనే ఆలోచనేతోనే. హరీష్ రావు ఇప్పుడు తెరాసలో ఉన్నారు గనుక ఆ పార్టీని వెనకేసుకు రాక తప్పదు. కానీ రేపు కేసీఆర్ ఆయనను పక్కనబెట్టి తన కొడుకుకి ముఖ్యమంత్రిని చేయబోతున్నట్లు గ్రహిస్తే అప్పుడు ఆయన కూడా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై విమర్శలు చేస్తూ, తనకు ఆ పదవి ఆఫర్ చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీలోనో చేరకుండా ఉంటారా?