చంద్రబాబు సూటి ప్రశ్న

 

ఈరోజు లోక్ సభలో కాంగ్రెస్ యంపీలు అనుచితంగా వ్యవహరించిన తీరుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ గట్టిగా ఖండించారు. అనుచితంగా ప్రవర్తించిన వారిపై పార్లమెంటు నియమ నిబంధనల ప్రకారం కటిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు కూడా. అయితే ఆయన మీడియాతో ఈ మాటలు చెప్పే కొద్దిసేపటి ముందు, లోక్ సభలో తీవ్ర అలజడి చేసి, సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలపై దాడికి పాల్పడ్డాడని ఆరోపింపబడుతున్న టీ-కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ ను ఆప్యాయంగా కౌగలించుకొని భుజం తట్టడం చూస్తే, కాంగ్రెస్ అధిష్టానమే దగ్గరుండి ఈ కధంతా నడిపిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. అంతేకాక, కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణా విషయంలో ఎటువంటి ద్వంద వైఖరి అవలంభిస్తోందో అర్ధమవుతోంది.

 

ఇక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ "అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈరోజు లోక్ సభ లో జరిగిన దురదృష్టకర ఘటనలను గట్టిగా ఖండించారు. కానీ సోనియా, రాహుల్ గాంధీలు మాత్రం ఎందుకు పెదవి విప్పలేదు?" అని ప్రశ్నించారు.  బీజేపీ నేత సుష్మాస్వరాజ్ కూడా సోనియాగాంధీని తీవ్రంగా విమర్శించారు. “ఆమె సభలో ఉన్నపటికీ చోద్యం చూస్తూ కూర్చోన్నారే తప్ప, తన యంపీలను నియత్రించాలని అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ దేశంపై క్రమంగా తన పట్టు కోల్పోయింది. ఇప్పుడు పార్టీపై కూడా పట్టుకోల్పోయిందని ఈరోజు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి,” అని విమర్శించారు.

 

రాహుల్ గాంధీ ఈ దేశాన్ని, ప్రభుత్వ పనితీరుని, ఈ రాజకీయ వ్యవస్థని పూర్తిగా మార్చేయాలని తరచూ లెక్చర్లు ఇస్తుంటారు. కానీ, ముందుగా తన స్వంత ఇంటిని కూడా చక్కబెట్టుకోలేరు. చక్కబెట్టుకోలేకపోతే పోయే, కనీసం ఇటువంటప్పుడయినా దైర్యం చేసి ఒక మాట మాట్లాడలేరు. కానీ ప్రధానమంత్రి పదవికి తాను అన్నివిధాల అర్హుడనని భావించడం విశేషం.