ఆ క్రెడిట్ అంతా నాదే: చంద్రబాబు

 

నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదందిట వెనకటికి ఒక ముసలవ్వ. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కళంకిత మంత్రులను తొలగించడం తన ఒత్తిడివల్లె జరిగిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చెప్పుకోవడం కూడా అలాగే ఉంది. ఈ రోజు రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు ఆయన అనుచరులు రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించమని కోరుతూ ఒక వినతి పత్రం సమర్పించి వచ్చారు.

 

తిరిగి వస్తున్నపుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ “మేము కళంకిత మంత్రులను తొలగించాలని రాష్ట్రపతిని కలవబోతున్నట్లు మీడియాలో వార్తలు రావడం మొదలవగానే, నిన్న రాత్రి హుటాహుటిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన కళంకిత మంత్రులిద్దరినీ రప్పించుకొని వారిచేత రాజీనామాలు చేయించినట్లు తెలిసింది. వారు ఇంకా రాజీనామాలు చేసారో లేదో ఇంకా తెలియదు కానీ, బాధ్యతగల ప్రతిపక్షంగా కళంకిత మంత్రులిద్దరినీ తప్పించేవరకు ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తూనే ఉంటాము. కేంద్రంలో ఒక పద్ధతి, రాష్ట్రంలో మరో పద్ధతి, ఒక రాష్ట్రంలో ఒక పద్దతి, మరో రాష్ట్రంలో మరో పద్ధతి కాకుండా దేశం మొత్తం మీద అవినీతికి వ్యతిరేఖంగా చర్యలు ఒకే రకం ఉండాలని మేము కోరుకొంటున్నాము,” అన్నారు.

 

గత నాలుగయిదు రోజులుగా డిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో కళంకిత మంత్రుల విషయంలో ఏమిచేయాలని తలలు బ్రద్దలు కొట్టుకొన్నాక, చివరికి దైర్యం చేసి ఇద్దరు మంత్రులను తొలగిస్తే, అదంతా తన పోరాటం వలననే జరిగిందని చంద్రబాబు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం. ఇది చంద్రబాబు రాజకీయ చతురతకు బదులు చవకబారు ప్రయత్నంగా మాత్రమే కనబడుతోంది. ఈవిధంగా ప్రతీ అంశంలో రాజకీయ ప్రయోజనం పొందాలని ఆశించడం ఆయన స్థాయి నేతలకి తగదు.