సీపీఐ నేతలను దువ్వుతున్న చంద్రబాబు

 

తెలుగుదేశం పార్టీతో సీపీఐ, సీపీఎం పార్టీలకు మొదటి నుండి సత్సంబంధాలే ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ రెండు పార్టీలలో సీపీఎం సమైఖ్యాంధ్ర కి మద్దతు ఇస్తుండగా, సీపీఐ ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తోంది. అందువల్ల ఆ రెండు పార్టీలు కూడా సీమంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తులకి సిద్దమే అయినప్పటికీ, సీపీఐ మాత్రం తన తెలంగాణా వాదానికి అనుకూలంగా తెరాసతో పొత్తులకి మొగ్గు చూపుతోంది. తెలంగాణా జిల్లాలలో సీపీఐ చాలా చోట్ల మంచి బలంగా ఉంది. అది వెళ్లి మరింత బలమయిన తెరాసతో చేతులు కలిపితే ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో బొటాబొటి సీట్లతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది.

 

ఈసారి రాష్ట్రంలో ఎలాగయినా మళ్ళీ అధికారంలోకి రావాలని కలలుకంటున్న చంద్రబాబుకి, తెలంగాణాలో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోతే, మళ్ళీ మరో ఐదేళ్ళు ప్రతిపక్షానికే పరిమితమవక తప్పదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరుసపెట్టి రోజుకొక కొత్త పధకంతో తెలంగాణాలో దూసుకుపోతుంటే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ‘సీమంధ్ర పార్టీలు మనకొద్దు’ అని ఇప్పటి నుండే తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

 

ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణా జిల్లాలో ఉన్నఒక్క స్నేహితుడిని, ఆసరాను వదులుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు. కానీ, ఆయనకి అవసరమని సీపీఐ తన పంధా మార్చుకోదని కూడా ఆయనకీ స్పష్టంగా తెలుసు. ఇక లాభం లేదనుకొన్న ఆయన ఈ సమస్యని రెండో వైపు నుంచి నరుక్కురావాలనే ఆలోచనతో సీపీఐ జాతీయ నాయకులను దువ్వడం మొదలుపెట్టారు.

 

యుపీయే, ఎన్డీయేల ధోరణితో విసుగెత్తిపోయున్నవారు ఆ రెంటికీ ప్రత్యామ్నాయంగా కేంద్రంలో 3వ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. భక్తుడు కోరుకొన్నదే దేవుడు కూడా వరంగా ఇచ్చినట్లు, చంద్రబాబుకూడా ప్రస్తుతం ఎన్డీయే కూటమితో జత కట్టే ఆలోచనలేదు కనుక, ఆయన కూడా కేంద్రంలో 3వ ఫ్రంట్ ఏర్పాటు చేసి మళ్ళీ చక్రం తిప్పాలని కలలు కంటున్నారు. అందువల్ల స్వామి కార్యంతో బాటు స్వకార్యం కూడా సిద్దిస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు?

 

అందుకే ఇటీవల చంద్రబాబు డిల్లీ వెళ్లినప్పుడు సీపీఐ జాతీయ నాయకులను కలిసి 3వ ఫ్రంట్ గురించి చర్చించి వచ్చారు. సీపీఐ నేత బర్ధన్ మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు ఆయనను తన ఇంటికి ఆహ్వానించి 3వ ఫ్రంట్ గురించి చర్చించడమే కాకుండా, ఆయనకు శాలువా కప్పి సన్మానం కూడా చేసారు. ప్రస్తుతానికి చంద్రబాబు కేవలం 3వ ఫ్రంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నపటికీ, అది పూర్తిగా రూపురేఖలు దిద్దుకొన్న తరువాత, తెలంగాణాలో తన తెలుగుదేశం పార్టీకి సీపీఐ మద్దతు ఈయాలనే మెలికపెడితే అప్పుడు ఉభయ పార్టీల విశాల ప్రయోజనాలను దృష్టిలోఉంచుకొని సీపీఐ తెలంగాణా ప్రాంతంలో కూడా తెదేపాతో పొత్తులకి సిద్దపడవచ్చునని చంద్రబాబు దూరాలోచన. మరి సీపీఐ చంద్రబాబు కోసం తన తెలంగాణా వాదం పక్కన పెడుతుందా లేదా అనేది మున్ముందు తెలుస్తుంది.