తెలుగుదేశానికి కలిసొచ్చిన నల్గొండ బాబు పాదయాత్ర

 

గత కొన్ని రోజులుగా చంద్రబాబుపై అలిగి ఆయన పాదయత్రకి, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న తెలంగాణానేత మోత్కుపల్లి నరసింహులు, ఈరోజు నల్గొండ జిల్లాలో అడుగుపెడుతున్న చంద్రబాబుతో ఆయన ఏవిదంగా వ్యహరిస్తారనే అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్న తరుణంలో, నరసింహులు స్వయంగా ఖమ్మం సరిహద్దు గ్రామం నేలకొండపల్లి మండలం పైనంపల్లికి వెళ్లి పార్టీ అధ్యక్షుడికి స్వాగతం పలికేరు. చంద్రబాబు కూడా ఆయనను ఆప్యాయంగా పలకరించడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు కూడా చాలా సంతోషించారు. మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ తమ మద్య విభేదాలేవి లేవని, తానూ కూడా తమ నాయకుడితో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని అన్నారు.

 

చంద్రబాబు తన పాదయాత్రలో ముందు నల్గొండ పర్యటనని రద్దు చేసుకోన్నపటికీ, బహుశః మోత్కుపల్లిని కలుపుకుపోవాలనే ఆలోచనతోనే నల్గొండలో కూడా ఆయన పాదయాత్ర మొదలుపెట్టి ఉండవచ్చును. ఆ నిర్ణయం వల్లనే ఈరోజు మోత్కుపల్లి వంటి సీనియర్ నాయకుడు పార్టీకి దూరం కాకుండా కాపాడిందని చెప్పవచ్చును. చంద్రబాబు గనుక నల్గొండలో ప్రవేశించకుండా ముందనుకొన్నట్లు నేరుగా కృష్ణా జిల్లావైపు సాగిపోయుంటే వారిరువురి మధ్య దూరం ఆలాగనే మిగిలిపోయి, చివరికి మోత్కుపల్లి మరో పార్టీ వైపు వెళ్లేందుకు దోహదపడేది. గానీ, చంద్రబాబు నిర్ణయం పార్టీకి మేలు చేకూర్చింది.

 

నల్గొండ జిల్లా కోదాడ మండలం శాంతినగర్లో అడుగుపెట్టిన చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికేరు. వారితో బాటు సిపిఐ, ఎమ్మార్పీఎస్, యుటిఎఫ్ కూడా స్వాగతం పలకడం మరో విశేషం.