ఛలో అసెంబ్లీ: ఓట్ల కోసం కెసిఆర్ వ్యూహమా!

 ....సాయి లక్ష్మీ మద్దాల

 

Chalo Assembly march KCR, KCR telangana Chalo Assembly, telangana issue Chalo Assembly

 

 

నేడు టి. ఆర్.యస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఛలో అసెంబ్లీ కార్యాక్రమం జరుగుతోంది. కె.సి.ఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4కోట్ల మంది ప్రజానీకం ఈ చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణా విద్యార్ధి జె. ఎ. సి తరఫున కోదండరాం ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒ.యు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణా ప్రాంతంలోని వివిధ శాఖల జె.ఎ. సి లు అన్ని ఈకార్యాచరణలో పాలుపంచుకోనేందుకు సిద్ధమయ్యారు. ఈ విధమైన కార్యాచరణలో భాగంగా ఎవరికివారే అసెంబ్లీ పై తమ తమ జె. ఎ. సి ల జెండాలు ఎగురవేసి తీరుతామని ప్రతినబూనారు.

 

ఈ తతంగమంతటి నేపధ్యంలో నగరంలో శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదముందంటూ  అధికార ప్రభుత్వం పోలీసువారి సహాయంతో వివధ రకాలుగా రక్షణ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే హైదరాబాద్ పోలీస్ వారి అష్ట దిగ్భధంలో ఉంది. స్కూళ్ళు,ఆఫీసులు,రోజువారీ వ్యాపారాలు,చిల్లర వర్తక,వాణిజ్య లావాదేవీలు అన్నీ మూతబడ్డాయి. రహదారులు,బస్ డిపోలు,ఫ్లై ఓవర్లు అన్నిటిని పోలీసులు ముసివేయటం జరిగింది. దీనిలోభాగంగానే పలువురు విద్యార్ధులను,కార్యకర్తలను,నేతలను అరెస్టులు చేస్తూ వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టటం జరుగుతోంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ. యూ లో ఉద్రిక్త వాతావరణం విద్యార్ధులు పోలీసుల మధ్య నెలకొని ఉంది.
 
                 దీనికంతటికి ప్రధాన కారణం తెలంగాణా సాధన అని సదరు ఉద్యమ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అసలు వాస్తవమేమిటో ఏ కార్యాచరణ తో తెలంగాణ సాధన అమలవుతుందో అనే విషయం సదరు నేతలకు తెలియదా?అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేసినా అది నిలవదు,గెలవదు అనే వాస్తవం వారికి తెలియదా?అసెంబ్లీలో మెజారిటి ఎమ్.ఎల్. ఎ లు సీమాంధ్ర వారే ఉన్నపుడు ఇది ఎలా సాధ్యం అనే విషయం వారికి బోధ పడదా?తీర్మానం చేయ వలసింది పార్లమెంట్లో అనికూడా  వారికి తెలియదా?అయినా ఈ టి. ఆర్. యస్ నేతలు ఛలో అసెంబ్లీ అనేకన్నా ఛలో పార్లమెంట్ అని పిలుపునిచ్చి ఉండాల్సింది. అపుడు కె.సి. ఆర్ సత్తా ఏమిటో తెలిసేది లోకానికి. ఎందుకంటే గతంలో చాలాసార్లు నేను డిల్లీలో వివిధపార్టీల నేతలందరినీ తెలంగాణపై ఒక అభిప్రాయానికి ఒప్పించ గలిగాను,బిల్లు పెట్టటం తరువాయి అంటూ చెప్పారు. తెలంగాణా పై బిల్లు పార్లమెంటులో పెడితే తాము మద్దతు ఇస్తామని బి. జె. పి కూడా పలుమార్లు పేర్కొన్నది. అపుడు ఎవరి ద్రుష్టి ఎటో తెలంగాణా ప్రజలందరికి బాగా అర్ధమయ్యి ఉండేది.



                 ఉద్యమాలు చెయ్యటం ప్రజాస్వామ్యంలో తప్పు కాదు. కాని ఆ ఉద్యమం వేడిని నేడు రాజకీయాలకనుగుణంగా మార్చుకొనే ప్రయత్నంలో సదరు నేతలందరు  ఉన్నారు. ఉద్యమాన్ని ఏదోరకంగా ప్రజలమధ్య రగుల్చుతూ ఉండటానికే ఇలా రకరకాల కార్యాచరణలన్ని చేస్తూ,ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాల్జేస్తున్నారు. ఈ రోజు ఈ చలో అసెంబ్లీ ముఖ్య ఉద్దేశ్యం రానున్న స్థానిక ఎన్నికలు. ఈ ఉద్యమం పేరుతో ఎన్ని రకాల ఇబ్బందులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కల్పించ గలిగితే అన్ని ఓట్లు రేపు 2014 ఎన్నికలలో టి.ఆర్.యస్  పొందవచ్చనే రాజకీయదురుద్దేస్యం.