చక్రి బంధువులు చాలా క్రూరంగా ప్రవర్తించారు.. శ్రావణి

 

సంగీత దర్శకుడు చక్రి మరణించిన తర్వాత ఆయన కుటుంబంలో వున్న కలహాలు బయటపడ్డాయి. చక్రి తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు తనను మానసికంగా, శారీరకంగా హింసించారని, ఆస్తికోసం వేధిస్తున్నారని చక్రి భార్య శ్రావణి మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. చక్రి జీవించి ఉన్నప్పుడు కూడా ఆయనకు తెలియకుండా తనను శారీరకంగా, మానసికంగా హింసించేవారని, ఒకసారి చక్రి చూడకుండా తన తలని గోడకేసి కొట్టారని శ్రావణి ఆరోపించారు. చక్రి ఆరోగ్యం విషమంగా ఉన్నవిషయాన్ని చెప్పడానికి తాను ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే ఎవరూ కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని ఆమె తెలిపారు. దాంతో తాను కనీసం కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా అంబులెన్స్‌లో చక్రిని ఆస్పత్రికి తీసుకెళ్ళానని తెలిపారు. అయితే చక్రి మరణించిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్లో ఉంచినప్పుడు చక్రి తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ల సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారని, ఇంట్లోని కప్ బోర్డులన్నిటికీ తాళాలు వేసేశారని ఆమె చెప్పారు. చక్రి డెబిట్ కార్డులు, చెక్కు పుస్తకాలు, ఉంగరాలు, గొలుసులు అన్నీ తీసుకెళ్లిపోయారని అన్నారు. తన భర్త మరణించాక తనకు కనీసం తనకు కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా అన్నిటికీ తాళాలు వేసుకుని వెళ్ళిపోయారని ఆమె చెప్పారు. తనతో ఎలాంటి బంధుత్వం లేనివారే తనను ఆదుకున్నారని, బంధువులు మాత్రం ఆస్తి కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తనకు ఫిట్స్ వచ్చినా పట్టించుకోలేదని శ్రావణి చెప్పారు.