కళంకిత మంత్రులు తప్పుకొంటేనే బెటర్: చాకో

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీ పెద్దలను కళంకిత మంత్రులను క్యాబినెట్ లో కొనసాగించుకోనేందుకు ఒప్పించుకొన్నారని, మరో వైపు ‘సబితా, ధర్మానలని ఇంటికి సాగనంపడానికి రంగం సిద్ధం’ అంటూ టీవీ చాన్నాళ్ళు బ్రేకింగ్ న్యూసులతో హోరెత్తించేస్తుంటే, హైదరాబాద్ చేరుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంతవరకు నోరు విప్పలేదు. అయితే ఆయన హైదరాబాద్ లో దిగే సమయానికే, అక్కడ డిల్లీ నుండి మరో బ్రేకింగ్ న్యూసు వచ్చిపడింది. అది ఎఐసిసి అదికార ప్రతినిధి పిసి చాకో వండి వడ్డించిన వార్త.

 

ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు మంత్రులు ఏవిధంగా స్వచ్చందంగా (?) తమ పదవుల నుండి తప్పుకొన్నారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తమంతట తామే తప్పుకొంటే బాగుంటుందని శలవిచ్చారు.

 

రెండు రోజుల నుండి వారు పదవులలో కొనసాగడంపై న్యూస్ చానల్సో జరుగుతున్న చర్చా కార్యక్రమాలు, న్యూస్ పేపర్లలో వస్తున్న విశ్లేషణలు వగైరాలన్నీ చూస్తే ఆత్మాభిమానం ఉన్న వారెవరయినా ఈపాటికే రాజీనామా ఇచ్చిఉండేవారు. కానీ అటువంటిదేమి జరుగలేదు. ఇంతవరకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు అరిచి గీ పెట్టినా వారు ఖాతరు చేయలేదు. కాంగ్రెస్ పార్టీకే చెందిన హనుమంత రావు వంటి పెద్దమనుషులు చెపుతున్నావారు పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకోయే ‘మీ అంతట మీరు తప్పుకొంటే బాగుటుందని’ చెప్పడం వారికి చెంప దెబ్బ వంటిదే. అయినప్పటికీ, వారు తమ పదవులలో కొనసాగితే, రేపటి నుండి ప్రతిపక్షాలు చాకో మాటలనే పట్టుకొని కళంకిత మంత్రులను నిలదీయడం మొదలుపెడతాయి.

 

గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకొని అవమానకర పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన కేంద్ర మంత్రుల కెదురయిన దుస్థితి, ‘ఆ ఐదుగురికి’ కూడా ఎదురయ్యే వరకు కొనసాగుతారో, లేక రేపే రాజీనామాలు సమర్పించుకొని ఈ గొడవ నుండి బయట పడతారో చూడాలి.