వేములవాడకు జర్మనీ ఎమ్మెల్యే... టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ!

 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన మోసపూరితంగా తప్పుడు పత్రాలను సమర్పించి పౌరసత్వం పొందారని స్పష్టం చేసింది. తప్పుడు మార్గంలో చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం పొందారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చేసిన ఫిర్యాదుపై చాలా కాలంగా కోర్టులో విచారణ సాగుతోంది. ఇరువురి వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఇటీవల తెలంగాణ హై కోర్టు ఆదేశించడంతో హోంశాఖ ఇద్దరి వాదనలు విని నిర్ణయం ప్రకటించింది. విదేశీ పర్యటనకు సంబంధించి రమేష్ తప్పుడు సమాచారం అందించారని తేల్చింది. దాంతో ఆయన భారత పౌరసత్వానికి అర్హత కోల్పోయారని తెలిపింది.

పౌరసత్వ చట్టంలోని 10(2),10(3) నిబంధనలను పరిగణలోకి తీసుకుంది. 5(1)(ఎఫ్) కింద పౌరసత్వ దరఖాస్తు చేసుకున్న తేదీకి ముందు రమేష్ తన విదేశీ పర్యటనల గురించి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా వాస్తవాలను దాచి పెట్టారని అభిప్రాయపడింది. ఆయన తన పౌరసత్వాన్ని వాస్తవాలను కప్పిపుచ్చటం ద్వారా సాధించారని అందుకు చట్టంలోని సెక్షన్ 10(2) కింద శిక్షార్హులవుతారని స్పష్టం చేస్తోంది. ఈ చర్య వల్ల ఆయన భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి అనర్హులవుతారని తెలిపింది. భారత పౌరసత్వం పొందడానికి 2008 మార్చి 31 న రమేష్ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో గత ఏడాది కాలంగా దేశంలో నివసించారా అన్న దగ్గర ఔను అని టిక్ చేశారు. గత ఏడాది కాలంలో ఏమైనా విదేశీ పర్యటనలు చేస్తే వాటి వివరాలూ పంపించమని రమేష్ కు 2008 నవంబర్ 21 న లేఖ రాశామని తెలిపింది కోర్ట్. దానికి ఆయన తిరిగి సమాధానమిస్తూ ఎటువంటి విదేశీ పర్యటన చెయ్యనట్లు తెలిపారని హోంశాఖ వెల్లడించింది. దాంతో 2009 ఫిబ్రవరి 4 న రమేష్ కు పౌరసత్వాన్ని మంజూరు చేశామని చెప్పింది. తర్వాతి కాలంలో 2009 జూన్ 15 న ఆది శ్రీనివాస్ రివిజన్ పిటీషన్ దాఖలు చేశారని తెలిపింది. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే ముందు ఏడాదిలో 2 సార్లు రమేష్ విదేశీపర్యటన చేసినట్టు తేలిందని వెల్లడించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడానికి తాము నియమించిన కమిటీ 2017 లో నివేదిక అందించిందని రమేష్ భారత ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించారని కమిటీ తేల్చిందని వివరించింది.

2009 ఎన్నికల్లో వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై చెన్నమనేని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే జర్మన్ పౌరుడిగా ఉన్న చెన్నమనేని తప్పుడు మార్గంలో భారత పౌరసత్వం పొందారని.. 2010 లో హైకోర్టులో ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పౌరసత్వం చెల్లదని.. 2013 లో కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ చెన్నమనేని సుప్రీం కోర్టును ఆశ్రయించగా హై కోర్టు తీర్పు పై స్టే విధించింది. ఆలోగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున రమేష్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పౌరసత్వంపై 3 నెలల్లో తేల్చాలని 2016 ఆగస్టులో కేంద్ర హోంశాఖకు సుప్రీం కోర్టు ఆదేశించింది. తరవాతి కాలంలో హోంశాఖ కేసును పరిశీలించి పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది. 

అటు పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని రమేష్ ప్రకటించారు. జూలై 15,2019 నాటి హై కోర్టు తీర్పును హోంశాఖ పరిగణలోకి తీసుకోక పోవటం శోచనీయమని చెప్పారు. తన పౌరసత్వాన్ని 2017 లో హోంశాఖ రద్దు చేసిన తర్వాత వెంటనే స్టే ఇచ్చిన హై కోర్టు సుదీర్ఘ వాదనలు విన్నదని జూలై 15,2009 న పౌరసత్వం రద్దును కొట్టివేసిందని అన్నారు. పౌరసత్వ చట్టం వాటి నిబంధనలు నైతిక విలువలను వ్యక్తి సామాజిక నిబద్ధతను పరిశీలిస్తూ చూడాలి తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని చెప్పారు. ఏ నిర్ణయం వచ్చినా మళ్లీ తమ వద్దకు రావొచ్చని హై కోర్టు చెప్పిందన్నారు.