జగన్ సర్కార్ కు మళ్ళీ కరెంట్ షాక్...

 

జగన్ సర్కార్ మొదలైన ఇన్ని రోజుల్లో ఏపీకి ప్రభుత్వానికి మళ్ళీ కరెంట్ షాక్ తగిలింది. సౌర పవన కంపెనీలకు కూడా ఎల్వోసీ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. రెండురోజుల్లో జారీ చేయకపోతే జాతీయ ఎక్సేంజ్ ల్లో కరెంటు కొనుగోలును నిషేధిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే నిధులు లేక అల్లాడుతున్న ఏపీ సర్కారుకు కేంద్రం తాజా ఆదేశం కొత్త తలనొప్పి గా మారింది. 

ఏపీ విద్యుత్ సంస్థలపై మరో పిడుగు పడింది. సౌర, పవన విద్యుత్ కంపెనీల కూడా ముందస్తు చెల్లింపు లకు సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ వోసీలు ఇవ్వాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. రెండ్రోజుల్లో వీటిని జారీ చేసి తమకు సమాచారం అందజేయాలని కేంద్ర ఇంధన శాఖ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు లేఖ రాసింది. లేని పక్షంలో జాతీయ విద్యుత్ ఎక్సేంజ్ నుంచి బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేయకుండా రాష్ట్రంపై నిషేధం విధించే పరిస్థితి వస్తుందని అందులో హెచ్చరించింది. ఇటీవలే ఒకసారి ఎక్సేంజ్ లో కొనుగోలుపై నిషేధం విధించింది దీంతో వారం పాటు రాష్ట్రాన్ని కరెంటు కోతలు అల్లాడించాయి. దీంతో కేంద్రం తాజా ఆదేశాలు విద్యుత్ శాఖ వర్గాలను మళ్లీ గడగడలాడిస్తున్నాయి. 

విద్యుత్ సరఫరా చేసే కంపెనీలకు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు ఒక వారం లేదా నెలకు సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయాలి. నలభై ఐదు రోజుల్లో వీటిని ఆ కంపెనీలు నగదుగా మార్చు కుంటాయి. ఈ ఆదేశాలు తప్పని సరి కావడంతో ముందుగా కేంద్ర విద్యుత్ సంస్థ ఎన్టీపీసీకి సంబంధించిన విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోసీల ఇవ్వడం మొదలుపెట్టింది. దీనికి నెలకు సుమారుగా ఐదు వందల యాభై కోట్ల వ్యయమవుతుంది. అయితే ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు ఎల్వోసీల ఇవ్వకపోవడంతో వాటిలో ఒక ప్రైవేటు ధర్మల్ విద్యుత్ కంపెనీ రాష్ట్రంపై కేంద్రాని కి ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుతో విద్యుత్తు ఎక్సేంజ్ లో రాష్ట్రంపై కేంద్రం నిషేధం విధించింది. దానితో ఆ కంపెనీ కూడా ఎల్వోసీ జారీ మొదలు పెట్టారు. సౌర, పవన కంపెనీ లకు మాత్రం ఇంత వరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వలేదు. దీని పైనే కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పవర్ సిస్టం కార్పొరేషన్ లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రానికి పంపింది. 

సౌర, పవన విద్యుత్ కంపెనీలకు ముందస్తు ఎల్వోసీల ఇవ్వాలంటే సరాసరిన నెలకు ఐదు వందల యాభై కోట్లు కావాలని విద్యుత్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఎన్టీపీసీ సంస్థలకు జారీచేయటానికే ప్రస్తుతం నెలకు ఐదు వందల యాభై కోట్లు ఖర్చవుతుంది. విద్యుత్ సంస్థల వద్ద దీనికి నిధుల లభ్యత లేకపోవడంతో ప్రభుత్వం నేరుగా సర్దుబాటు చేస్తుంది. ఇప్పుడు మళ్లీ ఇంత పెద్దమొత్తం ఇవ్వాల్సి రావడం అధికార వర్గాలను బెంబేలెత్తిస్తోంది. 

తాజా పరిస్థితిని విద్యుత్ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆర్ధికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ఏం చేయాలో నిర్ణయించాలని ఆయన సూచించినట్టు సమాచారం. సౌర, పవన విద్యుత్ పీపీఏలపై రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన వివాదమే దేశవ్యాప్తంగా ఈ ఆదేశాల జారీకి కారణమైందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలోనే కాదు అన్ని రాష్ట్రాలూ ఇటువంటి ప్రయత్నాల మొదలుపెట్టవచ్చు అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయటానికి కేంద్రం ఇటువంటి కఠిన వైఖరి అవలంబిస్తూ ఆదేశాలు జారీ చేస్తోంది. రాష్ట్రంలో ఈ వివాదం తలెత్తకపోతే కేంద్రం కఠినంగా ఉండేది కాదనిపిస్తోంది అని నిపుణుల అభిప్రాయం. ఇక జగన్ సర్కార్ ఈ అంశం పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.