జగన్ ని వదలని సీబీఐ.. హోదాను బట్టి మినహాయింపు తగదు!

ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకొని అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరడం సరి కాదని సిబిఐ స్పష్టం చేసింది. హాజరు మినహాయింపు ఏ నిందితుడికి హక్కు కాదని అది న్యాయస్థానం విచక్షణాధికారమని పేర్కొంది. నిందితుడికి హోదా ఆర్థిక స్తోమత కోర్టుపై ప్రభావం చూపలేవని స్పష్టం చేసింది. అలాగే చట్టం ముందు అందరూ సమానమేనని చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని తెలియజేసింది. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లను కొట్టేయాలంటూ సీబీఐ హైదరాబాద్ విభాగం ఎస్పీ పీసీ కల్యాణ్ 17 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

అదేవిధంగా చిన్న చిన్న కేసులలో న్యాయస్థానాలు విచక్షణాధికారం మేరకు నిందితుల వ్యక్తిగత హాజరు కు మినహాయింపు ఇస్తాయని తెలిపారు.  కానీ జగన్ పై ఉన్నవి తీవ్రమైన ఆర్ధిక నేరాలని వీటిలో హాజరు మినహాయింపు ఇవ్వడం సరి కాదని అఫిడవిట్ పేర్కొన్నారు. సీఎం హోదా ఉందన్న కారణంగా మినహాయింపు ఇస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆరోపణలు చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరం కాబట్టి మినహాయింపు ఇవ్వలేమని 2014 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని 2016 లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇదే అభ్యర్థనతో మరోసారి పిటిషన్ లు దాఖలు చేయగా వాటిని అదే కోర్టు కొట్టివేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీలును కూడా హైకోర్టు 2017 ఆగస్టు 31న కొట్టేసిందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెల 10 న ఒకసారి సీబీఐ కోర్టుకు జగన్ హాజరయ్యారు. దాదాపు 9 నెలలు సీఆర్పీసీ సెక్షన్ 317 కింద హాజరు మినహాయింపు కోరారు. సహేతుకమైన కారణాలు లేకుండానే మినహాయింపు కోరుతూ విచారణ ప్రక్రియకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా ఉందని తెలిపింది. 

నేర న్యాయస్మృతి లోని సెక్షన్ 273 ప్రకారం నిందితుడు సమక్షంలోనే నేర విచారణ జరగాలని సిబిఐ తన కౌంటర్ లో తెలిపింది. జగన్ ఇతర నిందితులతో కుమ్మక్కై ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారు. మోసం నమ్మక ద్రోహానికి పాల్పడి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు. రాష్ట్ర వనరులను ఇతరులకు కట్టబెట్టడం ద్వారా లబ్ది పొందారు. దాల్మియా కేసులో పునీత్ దాల్మియాకు సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందని ఆ కారణంగా జగన్ మినహాయింపు కోరడం సరికాదని పునీత్ ఒక్క కేసులో నిందితుడు జగన్ 11 చార్జిషీట్ లలో ప్రథమ నిందితుడిగా ఉన్నారని అన్నారు. దీంతో పుణిత్ తో పోలిస్తే ఆర్ధికంగా కూడా ఆయన భారీగా లబ్ది పొందారు కాబట్టి ఈ నేపథ్యంలో జగన్ పిటిషన్ లను కొట్టివేయండి అని సీబీఐ అభ్యర్థించింది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏప్రిల్ 9న తుది విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొన్నటి కోర్ట్ విచారణ వాయిదా పడిన కారణంగా ఏపీ సీఎం జగన్ కు కొంత మేర ఉపశమనం కలిగినట్లు తెలుస్తోంది.