చంద్రబాబుకి జేడీ లక్ష్మి నారాయణ క్లీన్ చిట్

 

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్రంలో తన పదవీ కాలం ముగియడంతో మహారాష్ట్రలోని తన స్వంత క్యాడర్ కు మొన్న తిరిగి వెళ్ళిపోయారు. వెళిపోయే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ కేసుల గురించి కొంత వివరణ ఇచ్చారు.

 

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ దాదాపు ముగింపుకు చేరుకొందని, అందువల్ల తన బదిలీవల్ల దానిపై ఎటువంటి ప్రభావం పడబోదని విచారణకు కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడదని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ కేసును ఎవరు చేప్పటినా కూడా విచారణ త్వరలోనే ముగిసిపోవచ్చునని ఆయన అన్నారు.

 

చెన్నై కి చెందిన అరుణాచలం అనే సీబీఐ అధికారికి ఈ బాధ్యతలు అదనంగా అప్పగించబడ్డాయి. ఆయన గనుక ఇంతవరకు ఈ కేసులపై విచారణ చేస్తున్న రాష్ట్ర సీబీఐ అధికారులకు పూర్తి స్వేచ్చనిస్తే, త్వరలో దర్యాప్తు ముగిసి జగన్ కేసుల్లో తుది చార్జ్ షీట్స్ దాఖలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, జగన్ త్వరలో బెయిలు పొందే అవకాశం కూడా ఉండవచ్చును.

 

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తానూ చంద్రబాబును ఉపేక్షిస్తున్నానని వైయస్సార్ కాంగ్రెస్ నేతల చేస్తున్న విమర్శలకు బదులిస్తూ, ఈవిషయంలో చంద్రబాబు ఎటువంటి అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక ఆధారాలు లేనందునే ఆయనపై విచారణ మొదలుపెట్టలేదని, ఆయన హయంలో ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం మొదలయినపట్టికీ, దానిని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి మాత్రం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డేనని ఆయన స్పష్టం చేసారు.

 

లక్ష్మి నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకి కొండంత బలం ఇవ్వగా, వైకాపా నేతలకి ఇబ్బందికరంగా మారనుంది. ఇంతవరకు, ఆ పార్టీ నేతలు ఈ వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నఆరోపణలు లక్ష్మి నారాయణ వ్యాక్యాలతో తప్పని ఋజువు అవడమే కాకుండా, తిరిగి మళ్ళీ అవి వైకాపా మెడకే చుట్టుకొన్నాయిప్పుడు. అయితే, జగన్ అమాయకుడని బలంగా వాదిస్తున్న ఆ పార్టీ నేతలు లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను కూడా తీవ్రం ఖండించి, చంద్రబాబు విషయంలో తమ పాత పాటే అందుకొనే అవకాశం ఉంది.