సీబీఐలో పని చేశానని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నా

 

సీబీఐలో ఈమధ్య ఎలాంటి పరిణామాలు జరిగాయో అందరికీ తెలిసిందే. కేంద్రం సీబీఐ డైరెక్టర్ ని, స్పెషల్ డైరెక్టర్ ని సెలవు మీద పంపడం.. అర్ధరాత్రి వేళ కొత్త డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించడం.. సీబీఐ ప్రధాన కార్యాలయంలో అంతర్గత తనిఖీలు.. అవినీతి ఆరోపణలు.. కోర్టులో పిటీషన్లు. ఇలా జరగాల్సిన రచ్చ అంతా కొద్దిరోజుల్లోనే జరిగిపోయింది. సీబీఐ ప్రతిష్ఠ మసకబారిపోయింది. దీంతో స్వతంత్ర దర్యాప్తు సంస్థగా పేరున్న సీబీఐని ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు చిన్నాభిన్నం చేయటమే కాకుండా.. ఆ సంస్థకు ఉన్న పేరు ప్రఖ్యాతుల్ని మంట కలిపేలా చేసిందన్న విమర్శను మూటగట్టుకుంది.
 
తాజాగా చెన్నైలో 'సీబీఐ- ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు' అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించారు. దీనికి సీబీఐ మాజీ చీఫ్ రఘోత్తమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీబీఐలో 36 ఏళ్లు పని చేసి రిటైర్ అయ్యానని.. సంస్థ పరువు ప్రతిష్ఠలు ఇంతలా దిగజారిపోవటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను సీబీఐలో పని చేశానని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ పాలనా వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం.. సంస్థ అధ్యక్షుడ్ని మార్చటంతో సంస్థకున్న పరువు మంటగలిసిందన్నారు. సీబీఐలో ఉన్నతాధికారిని మార్చటం ఇప్పటివరకూ కష్టంగా ఉండేదని.. అలాంటిది బీజేపీ నేతల కారణంగా సునాయాసంగా సంస్థ చీఫ్ ను మార్చేశారన్నారు. తాజా పరిణామాలతో సీబీఐకి ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరు కాస్తా.. కంట్రోల్డ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని విమర్శించారు. ఇకపై సీబీఐని అలా పిలిస్తే మంచిదని అన్నారు.