సీబీఐ బిల్లు.. పార్లమెంట్ ఓకే...

 

దేశంలోనే అత్యున్నత నేర పరిశోధన సంస్థ సీబీఐ డైరెక్టర్ నియామకంలో కొన్ని ముఖ్యమైన సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సవరణల బిల్లుకు బుధవారం పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. తాజా సవరణల ప్రకారం ఇక నుంచి సీబీఐ డైరెక్టర్ నియామకాన్ని దేశ ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్షనేత కలిసి ఉమ్మడిగా నిర్ణయిస్తారు. అయితే, ఇందులో ఏ ఒక్కరు ఆ సమావేశానికి రాకపోయినా సమావేశంలో పాల్గొన్న మిగిలిన ఇద్దరు సీబీఐ డైరెక్టర్ నియామక ప్రక్రియని పూర్తి చేయవచ్చు. అయితే ఈ సవరణ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎప్పుడూ ఖాళీగా ఉండబోరని కేవలం కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునే ఈ నూతన నిబంధన పెట్టారని ఘాటుగా విమర్శించింది. ఇలాంటి కీలక విషయాలలో అభ్యంతరం వ్యక్తం చేయడానికి అసలు కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాయే లేదని కాంగ్రెస్ సభ్యులు వాపోయారు.