జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ మంత్రికి సీబీఐ కోర్టు షాక్‌... 17న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం

జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో అనుబంధ ఛార్జిషీటును సీబీఐ కోర్టు స్వీకరించింది. రెండేళ్ల క్రితమే అడిషనల్‌ ఛార్జి షీటును దాఖలు చేసినప్పటికీ హైకోర్టు స్టే విధించడంతో విచారణ నిలిచిపోయింది. అయితే, తాజాగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో అనుబంధ ఛార్జిషీటును స్వీకరించిన సీబీఐ కోర్టు... సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి... అలాగే, రిటైర్డ్ అధికారులు శామ్యూల్‌, వీడీ రాజగోపాల్‌కు సమన్లు జారీ చేసింది.

వాస్తవానికి, పెన్నా వ్యవహారంలో రెండేళ్ల క్రితమే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహా నిందితులంతా అనుబంధ ఛార్జిషీటును స్వీకరించవద్దంటూ వాదించారు. అయితే, తమకున్న సమాచారంలో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేశామని, ఆ తర్వాత మరిన్ని వివరాల ఆధారంగా అనుబంధ ఛార్జిషీట్ చేశామని సీబీఐ వివరించింది. చట్ట ప్రకారం ఎప్పుడు కీలకాంశాలు వెలుగులోకి వచ్చినా ఛార్జిషీటు దాఖలుచేసే వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉందని తెలిపింది. అయితే, ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని తెలిపిన సీబీఐ.... పాత ఛార్జిషీటులో ఉన్న విషయాలనే మళ్లీ ప్రస్తావిస్తూ మరికొందరిని నిందితులుగా చేర్చడం సమంజసం కాదంటూ జగన్ సహా నిందితుల తరపు లాయర్లు వాదించారు. అయితే, నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను తోసిపుచ్చిన సీబీఐ కోర్టు.... అనుబంధ ఛార్జిషీటును విచారణకు స్వీకరించి సమన్లు ఇష్యూ చేసింది.

అనంతపురం, తాండూరు, ఇతర ప్రాంతాల్లో పెన్నా సిమెంట్స్‌కు జరిగిన గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అప్పటి గనులశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అలాగే ఆనాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా పలువురు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తోంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం వీళ్లంతా నేరానికి పాల్పడ్డారని అనుబంధ ఛార్జిషీటులో సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాంతో, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి... అలాగే, రిటైర్డ్ అధికారులు శామ్యూల్‌, వీడీ రాజగోపాల్ తదితర నిందితులందరూ జనవరి 17న తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశించింది.