జగన్‌కు ఈడీ షాక్‌... జనవరి 24న కీలక తీర్పు...

ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని, తప్పనిసరిగా హాజరుకావాలంటూ కోర్టు తేల్చిచెప్పడంతో న్యాయస్థానం ముందు అటెండ్ అయ్యారు. అయితే, సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు సహా ఈడీ నమోదు చేసిన 6 అభియోగ పత్రాలపై విచారణ జరిపిన న్యాయస్థానం... తదుపరి విచారణను జనవరి 17కి వాయిదా వేసింది. అయితే, డిశ్చార్జి పిటిషన్లన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు ముగియడంతో నిర్ణయాన్ని కూడా జనవరి 17కే వాయిదా వేసింది. అయితే, ముఖ్యమంత్రిగా ప్రజా విధుల్లో ఉన్నందున ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మరో పిటిషన్‌లో జగన్మోహన్‌రెడ్డి అభ్యర్ధించడంతో ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తీవ్రమైన ఆర్ధిక నేరాలు కావడంతో నిందితులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దంటూ కోర్టును కోరింది ఈడీ. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు పూర్తవడంతో తీర్పును జనవరి 24కి వాయిదా వేసింది.