జగన్ కి సీబీఐ కోర్టు షాక్.. సీఎం అయినా వారం వారం రావాల్సిందే!!

 

అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ ని సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీఎంగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో.. వారం వారం కోర్టు విచారణకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ తన పిటిషన్‌లో కోరారు. సీఎం హోదాలో ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వస్తే  సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ తదితర వాటికి ఒక్కరోజుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని.. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని, దీనివల్ల మరింత భారమని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. 

అయితే జగన్‌ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారనే అరెస్టు చేశామని, ఇప్పుడు సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే హాజరు మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ స్పెషల్‌ పీపీ వాదనలు వినిపించారు. అదీగాక.. హాజరు మినహాయింపు కోరుతూ జగన్‌ గతంలో దాఖలు చేసుకున్న పిటిషన్లను రెండు పర్యాయాలు సీబీఐ కోర్టు కొట్టివేసిందని, దీన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. సీబీఐ కోర్టు తీర్పును సమర్థిస్తూ జగన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. హోదాను కారణంగా చూపించి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరరాదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో నవంబరు 1న తీర్పు వెలువరిస్తామని సీబీఐ కోర్టు రెండు వారాల క్రితం ప్రకటించింది. దీంతో ఈరోజు తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే కోర్టు.. సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ.. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటీషన్ ని కొట్టివేసింది.