హోంమంత్రి సబితకు సిబిఐ సమన్లు

 

ఈ రోజు జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఐదో చార్జీషీట్‌ దాఖలు చేసింది. దానిని విచారణకు చెప్పటిన సీబీఐ కోర్టు ఈ కేసులో నాలుగవ నిందితురాలిగా పేర్కొనబడిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి వచ్చేనెల 7వ తేదీన కోర్టుకు హాజరుకమ్మంటూ సమన్లు జారీ చేసింది. ఇంతవరకు ఆమెను వెనుకేసుకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది చెంపపెట్టు అని ప్రతిపక్షాలు అభివర్ణించాయి.

 

సబితా రెడ్డితో బాటు, ఈ కేసులో ఏ1-నిందితుడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి, విజయసాయి రెడ్డి, దాల్మియా సిమెంట్స్ అధినేత పునీత్ దాల్మియా, ఈశ్వర్ సిమెంట్స్ అధినేత సజ్జల దివాకర్ రెడ్డి, ఐఏయస్ ఆఫీసర్స్ శ్రీ లక్ష్మి, రాజగోపాల్ మరియు మరో ఆరుగురికి అదే రోజున కోర్టుకి హాజరుకమ్మంటూ సమన్లు జారీ చేసింది.

 

కేంద్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులు పదవులనుండి తప్పుకొన్న తరువాత, రాష్ట్రంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నమంత్రులను ప్రభుత్వం నుండి తొలగించాలని ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతున్న నేపద్యంలో రేపు డిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి వారి విషయంలో అధిష్టానం సలహా తీసుకొందామని ఆలోచిస్తుండగానే సీబీఐ కోర్టు సమన్లు జారీ చేయడంతో మరింత ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరుగుతుంది.

 

ఇంతవరకు కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేంద్రం అనుకరించిన వైఖరినే అనుకరిస్తున్నందున, ఇప్పుడు అదేవిధంగా ఇక్కడకూడా కళంకిత మంత్రులు స్వచ్చందంగా తప్పుకోనేలా చేస్తారని మాత్రం భావించలేము. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షాల నుండి అంత ఒత్తిడి లేదు.

 

పైగా ఇంతకాలం వెనకేసుకు వచ్చిన తరువాత, ఇప్పుడు వారిని తొలగిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా తప్పు అంగీకరించినట్లవుతుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకే చెందినవారు గనుక, వారి మద్య ఇంత వరకు ఉన్నసన్నటిగీత కూడా తొలగిపోయి అంతా ఆ తానులో ముక్కలే అనే భావన ప్రజలలో కలుగుతుంది. బహుశః ఈ భయంతోనే ఇంతకాలం ముఖ్యమంత్రి కళంకిత మంత్రులను కాపాడుకొంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు సీబీఐ కోర్టు సాక్షాత్ రాష్ట్ర పోలీసులకు అధినేత అయిన హోంమంత్రిని దోషిగా కోర్టు బోనులో నిలబడేందుకు సమన్లు జారీ చేయడంతో, అటువంటి అవమానకర పరిస్థితులను భరించి ఆమెను అదే పదవిలో కొనసాగించాలో లేక ఆమెకు ఉద్వాసన చెప్పి తన ప్రభుత్వంపై మరక పడకుండా జాగ్రత్త పడటమో చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనలో ఏ విషయమూ తెలిపోవచ్చును.

 

యాదృచ్చికంగా ఈ రోజే చంద్రబాబు తన అనుచరులతో కలిసి గవర్నర్ నరసింహన్ కు కళంకిత మంత్రులను ప్రభుత్వం నుండి తొలగించాలని వినతి పత్రం ఇచ్చారు.