పలుకవే నా బంగారు చిలుకా

 


 

ఈ కాకులేమిటి అచ్చు మన చిలకల్లానే అరుస్తున్నాయి? 

 

అవి కాకులు కావమ్మా మన సీబీఐ చిలుకలే. మనం ఇంతకాలం కప్పెట్టి ఉంచిన బొగ్గు కుంభకోణంలో అవి ముక్కు దూర్చినందుకు వాటికి కూడా ఆ బొగ్గు మసి అంటుకోవడంతో మీకు అలా కనిపిస్తున్నాయి అంతే.   

 

అయితే, అదేమిటయ్యా అవి మనతో షేర్చేసుకోవలసిన సీక్రెట్ వ్యవహారాలను ఎవరో పీసీ.ఫరెక్ అట అతనితో షేర్ చేసుకోవడమేమిటి? అతను మన మౌనముని మన్మోహన్ పై బురద జల్లడం ఏమిటి? బుద్ది లేకపోతేను? అసలు మనం మన చిలుకలకి ఎంతగా శిక్షణ ఇచ్చివదిలినప్పటికీ, అవి ఎదుట వాడి ఇల్లొదిలి తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ మనింటి మీదకే చేరి గోలచేస్తున్నాయి?

 

 

వాటిని అనుమానించకండి అమ్మగారు. వాటికి విశ్వాసం ఉండబట్టే అవి మనింటి చుట్టూ తిరుగుతున్నాయి.

 

 

ఏడిసినట్టే ఉంది నీ తెలివి. అవి మనకు విశ్వాసంగా ఉంటే మరి మన మనుషులనే ఎందుకు పొడుస్తున్నాయి?

 

అదేంటమ్మా మేము వాటికి బాగానే ట్రైనింగ్ ఇచ్చేమే?  

 

 

ఏమిటి అప్పుడే మరిచిపోయావా? వాటి గోల భరించలేక ఇంతకు ముందు మన రైల్వేమంత్రి  బన్సాల్ గారిని, న్యాయ శాఖా మంత్రి అశ్వినీ కుమార్ గారిని మనమే బయటకు గెంటేసుకోవలసి వచ్చింది. ఇప్పుడేమో ఏకంగా అవి మన్మోహన్ గారి కుర్చీమీద వాలి గోల చేస్తున్నాయి. అలాగని ఆయనను గెంటేయలేము కదా? వీటికి అసమదీయులెవరో(మనవాళ్ళెవరో) తసమదీయులెవరో(శత్రువులెవరో) కూడా గుర్తించేలా శిక్షణ కూడా ఈయలేకపోతే ఎలా? అవసరమయితే ఇటలీ నుండో లేక ఇంగ్లాండ్ నుండో ఎవరినయినా రప్పించి వీటికి మంచి శిక్షణ ఇప్పించండి.  

 

అలాగేనమ్మా. 

 

 

 

నువ్వు అలాగేనమ్మా... అలాగేనమ్మా అంటూ ఇక్కడ కాలక్షేపం చేస్తూ కూర్చుంటే అవతల ఆ చిలుకలు మన కొంప ముంచేట్లున్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో వదిలిన మన చిలకలు చూసిరా.. అంటే ఏకంగా కాల్చివచ్చాయి. వాటి దెబ్బకి పాపం ఆ..ధర్మాన, సబిత ఇద్దరు మంత్రులకి పదవులూడితే, మరొక పెద్దాయన ఎవరో మోపిదేవిట! పాపం ఏడాదిన్నరగా జైలులోనే మగ్గుతున్నాడుట. మనం గీకమన్నచోటల్లా సంతకాలు గీకేసే మరో డజను మంది అధికారులు కూడా ఈ చిలుకలు పుణ్యామాని కోర్టులు చుట్టూ తిరుగుతున్నారిప్పుడు. వారిని చూస్తే నా మనసు కరిగిపోతుంది. అలాగని వాళ్ళు మనోళ్ళేనని నలుగురిలో వెనకేసుకు రావడం కుదరదు కదా? 

 

 

అవునమ్మగారు.. ఈ పాడు చిలుకలకి అసమదీయులేవరో తసమదీయులెవరో గుర్తు పట్టడంలో ఇంకా శిక్షణ ఇప్పించాల్సిన అవసరముంది. అప్పటికీ ఒకటికి పదిసార్లు అసమదీయుల ఫోటోలు చూపించి మరీ వదులుతాము. కానీ ఏదో ఒకటి అరా మనవాళ్ళని అవి గుర్తుపట్టి కాపాడినా, ఈ ప్రతిపక్ష పార్టీలు అది చూసి కాకుల్లా గోలగోల చేస్తున్నాయి. అప్పటికీ పదునయిన ముక్కులున్న మన చిలుకలని వెనక్కి రప్పించుకొని, ముసలి చిలుకలని ఆ స్థానంలో పెట్టి మనకి అవసరమయిన ఒకటీ అరా మనుషులను వీలును బట్టి బయటకి తెచ్చుకొంటున్నాము తప్ప అధికారం మన చేతిలో ఉంది కదాని అందరికీ ఒకటే సారి బెయిలిచ్చేసి బయటకి తెచ్చేసుకోవట్లేదు కదా?

 

 

అవునయ్యా.. మన నీతి నిజాయితీ లోకానికేమి తెలుసు? పశువులకి గడ్డి కూడా వదలకుండా తినేద్దామని ప్రయత్నించిన ఆ లాలూ ప్రసాద్ ని మన చిలుకల చేత నానా గడ్డి తినిపించడం లేదూ? అటువంటి విషయాలు ఎవరూ పట్టించుకోరు. కానీ, మా ముద్దుల బాబు ఏదో ముచ్చటపడి నాన్సెన్స్ అనకపోయి ఉంటే ఆ లాలూ ప్రసాద్ ని కూడా మనమే వెనకేసుకు వస్తున్నామని లోకం కోడై కూసిందంటే నమ్ము. 

 

అవునమ్మా నేను కూడా అదే అనుకొన్నాను. 

ఆ.. 

ఆ..ఆ..నా అభిప్రాయం అదికాదమ్మా..జనాలు కూడా అలా అనేసుకోన్నారా? అని నేను అనుకొన్నానమ్మా. 

 

ఆ..సర్సరే...ముందు ఆ చిలుకలు మన పాలిట రాబందులుగా మారకుండా చూడు.  

 

అలాగేనమ్మా..మొన్న మొన్ననే మన దిగ్గీ రాజాగారు కూడా అసమదీయులెవరో,  తసమదీయులెవరో తెలుసుకోమని వాటికి గట్టిగా చెప్పారు. కానీ ఈ విషయమూ ఎవరో కాకితో కబురంపినట్లు ఎక్కడో హైదరాబాదులో ఉన్నవాళ్ళందరికీ కూడా ఎలాగో తెలిసిపోయింది. దానితో మళ్ళీ కాకి గోల మొదలయింది. అసలు ఈ చిలుకలకి ఆయనతో పనేమిటి? అవి ఆయన దగ్గర ఏమి నేర్చుకోవడానికి వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి? అంటూ అర్ధం పర్ధం లేని చిలక ప్రశ్నలు అడుగుతూ ప్రతిపక్షాల వాళ్ళు కాకుల్లా గోల గోల చేసారమ్మా.

 

 

ఆ..సరే లేవయ్యా కాకులు అరుస్తున్నాయని చిలుకలను వదలకుండా పంజరంలో పెట్టుకొని కూర్చొంటామా?

 

 

అవునమ్మ గారు. మొన్న సుప్రీంకోర్టు కూడా ఆ మాటే అంది. అవన్నీ పంజరంలో పెరుగుతున్న చిలుకలు అని బలే కనిపెట్టేసిందమ్మగారు. 

 

 

ఆ..మరిచిపోయాను...మనం గుజరాత్ కి పంపిన చిలుకలు ఏమయినా పలుకుతున్నాయా లేకపోతే అవి కూడా నమో నమోఅంటూ అక్కడే ఆయన చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాయా? 

 

 

భయపడకండి అమ్మగారు. అవి ఎంతయినా మన పెరటి జాం చెట్టు మీద పుట్టి పెరిగిన చిలుకలు. ఆ మోడీ ఇంటి మీద వాలాలని ప్రయత్నించాయి గానీ ఆయన మీతోనే నేను ఎన్నికలలో పోటీ చేయాలా?” అని అడిగేసరికి అవి బిత్తరపోయి అక్కడి నుండి ఎగిరొచ్చేసి, ఆయన శిష్యుడు ఎవరో అమిత్ షా అట అతని వెంటబడ్డామని ఇటుగా వస్తున్న కాకితో మనకి కబురు పంపాయమ్మ గారు.

 

 

ఆ..సర్సరే! నీక్కూడా వాటి సహవాసంతో చిలుక పలుకులు పలకడం బాగా అలవాటయిపోయింది తప్ప పని కనబడటం లేదు. ఇంతకీ ఉత్తర ప్రదేశ్ లో మాయావతి ఇంటికి, ములాయం ఇంటి మీదకి వదిలిన మన చిలుకలు ఏమి చేస్తున్నాయిట? మాయావతి వ్యవహారంలో మన చిలుకలు సరయిన కార్డుతీయలేదని ఆవిడని సుప్రీం కోర్టు వదిలిపెట్టేసిందిట కదా? 

 

అవునమ్మగారు. ఇది మనం ముందుగా అనుకొన్నదే కదా? తమరు పని ఒత్తిడిలో మర్చిపోయినట్లున్నారు.

 

 

ఆ..ఆ...అవునవును..మరిచిపోయాను. వాళ్ళని కేవలం భయపెడుతూ మన మాటవినేలా చూడమని చెప్పాను కదా. సర్సరే...ఎందుకయినా మంచిది దేశంలో ఉన్న తసమదీయులందరి మీద మన చిలుకలను ఓ కన్నేసి ఉంచమను..ఎప్పుడు ఎవరి ప్లగ్గు పీకాల్సి వస్తుందో ఎవరికి తెలుసు?

 

అలాగే అమ్మగారు.  

 

 

అంత కంటే ముందుగా వాటికి అసమదీయులు, తసమదీయులను గుర్తు పట్టేందుకు బాగా శిక్షణ ఇప్పించు. అప్పుడే వాటిని బయటకి వదిలి పెట్టు. మరిచిపోకు. మళ్ళీ మరో సారి పొరపాటయ్యిందంటే ఈ సారి నీ మీదకే వాటిని వదిలిపెడతా గుర్తుంచుకో..


అయ్యో! ఎంత మాటా...తప్పకుండానమ్మా!