మోడీ కోసం తవ్విన గోతిలో కాంగ్రెస్

 

గుజరాత్ లో 2004లో జరిగిన ఒక ఎంకౌంటర్ లో ముంబై కి చెందిన ఇష్రాద్ అనే 19 ఏళ్ల యువతి కూడా మృతి చెందింది. అది భూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలు వెల్లువెత్తడంతో, కేంద్రం సీబీఐని దర్యాప్తుకి ఆదేశించింది. సీబీఐ కూడా చాలా చురుకుగా దర్యాప్తు చేసి, ఇది ఖచ్చితంగా భూటకపు ఎన్కౌంటరేనని తేల్చి చెప్పడమే కాకుండా దీనితో సంబంధం ఉందని భావించిన అనేక మంది గుజరాత్ పోలీసు అధికారులను కూడా అదుపులోకి తీసుకొంది. దాదాపు 1200 పేజీల చార్జ్ షీట్ కూడా తయారు చేసింది.

 

అయితే, ఇష్రాద్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హత మార్చేందుకు మానవబాంబుగా శిక్షణ తీసుకొన్నయువతి అని ఇంటలిజన్స్ బ్యురో 2009 లోనే నాటి హోంమంత్రి చిదంబరానికి ఒక లేఖ వ్రాసింది. అదే విధంగా అమెరికాలో పట్టుబడ్డ డేవిడ్ హెడ్లీ కూడా ఇష్రాద్ పేరుని ప్రస్తావించాడు. అయితే ఇంటలిజన్స్ బ్యూరో (ఐ.బీ.) హోంమంత్రికి వ్రాసిన లేఖ గురించి, హెడ్లీ చెప్పిన అంశాల గురించి కేంద్రానికి పూర్తి సమాచారం ఉన్నపటికీ, సీబీఐ ను విచారణకు ఆదేశించడం, సీబీఐ అది భూటకపు ఎన్కౌంటర్ అని తేల్చి చెప్పడం జరిగిపోయింది.

 

కానీ, సీబీఐ అధికారులు తమను కూడా వేదిస్తున్నారంటూ ఇంటలిజన్స్ బ్యూరో (ఐ.బీ.) డైరక్టర్ హోంశాఖకు వ్రాసిన లేఖ బయటపడటంతో, ఒక్కసారిగా ఈ తెర వెనుక భాగోతం కూడా బయటపడింది.

 

మోడీని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తీసుకు వచ్చి రాహుల్ గాంధీకి సవాలు విసురుతున్న తమను కట్టడి చేయడానికే, కేంద్రం, సీబీఐ రెండూ కలిసి ఈ నాటకమంతా ఆడాయని గ్రహించిన బీజేపీ కాంగ్రెస్ కు, సీబీఐకి ఈ విషయంలో అనేక ప్రశ్నలు సందించింది. కానీ వాటికీ జవాబు ఇవ్వకుండా, త్వరలోనే మోడీ అసలు రూపం బయటపడుతుందని కాంగ్రెస్ బీజేపీని ఇంత కాలంగా ఎద్దేవా చేస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు అకస్మాతుగా ఐ.బీ. వ్రాసిన లేఖ బయటపడటంతో కాంగ్రెస్ పని కుడితిలో పడిన ఎలుకలా తయారయింది.

 

సుప్రీంకోర్టు ఇటీవలే సీబీఐని ‘అనేక యజమానుల చేత ఆడించ బడుతున్న పంజరంలో చిలుక’గా అభివర్ణించిన కొద్ది రోజులకే, సీబీఐ మళ్ళీ అత్యుత్సాహానికి పోయి మరో మారు కోర్టు తనకిచ్చిన పేరుని సార్ధకం చేసుకొంది.

 

ఐబీ అధికారులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తూ సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తాము హైకోర్టు ఆదేశాల మేరకే వారిని విచారణ చేస్తున్నామని, ఇష్రాత్ కేసులో ఐబి ప్రమేయం కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పడం విశేషం. అంటే, ఐబీని కూడా ఈ కేసులో దోషిగా భావిస్తున్నదా? అనే సంగతి ఇంకా సీబీఐ స్పష్టం చేయవలసి ఉంది.

 

ఈవిధంగా రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంత తీవ్రమయిన కేసులో ఇంత తీవ్రమయిన ఆరోపణలు ఒకరిపై మరొకరు గుప్పించుకోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. మోడీ కోసం తవ్వుతున్న గోతిలోనే తాను కూడా నిలబడి ఉన్నట్లు కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. ఇప్పుడు ఆ గోతి లోంచి ఎవరు బయటపడుతారో కాలమే చెపుతుంది.