జగన్మోహన రెడ్డి కేసులో కీలక మలుపు

 

అక్రమాస్తులకేసులో అరెస్ట్ అయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి మరియు విజయసాయిరెడ్డిలపై దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన 5వ చార్జ్ షీట్ లో వారిరువురిపై ఐపియస్ 409 సెక్షన్ క్రింద మోపిన నమ్మకద్రోహం అభియోగాన్నివారికి వర్తించదంటూ సిబిఐ కోర్టు ఈ రోజు త్రోసిపుచ్చింది.

 

సాదారణంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు లేదా ప్రభుత్వాధికారులు, ప్రజలను లేదా ప్రభుత్వాన్ని మోసగించినప్పుడు లేదా కుట్రలకు పాల్పడినప్పుడు మాత్రమే ఈ సెక్షన్ క్రింద నేరాభియోగం మోపుతారు. జగన్ మరియు విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ప్రభుత్వంలో ఏవిధంగా గాను పాలుపంచుకోలేదు గనుక వారికి ఈ అభియోగం వర్తించదని కోర్టు తిరస్కరించింది. అదేవిధంగా వారిపై సెక్షన్ 12 క్రింద సీబీఐ మోపిన మరో అభియోగం ‘క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టు’ కూడా వారికి వర్తించదని కోర్టు తిరస్కరించింది. కానీ, అదే చార్జ్ షీటులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏయస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి, రాజగోపాల్ మీద సీబీఐ మోపిన అభియోగాలను మాత్రం కోర్టు త్రోసిపుచ్చలేదు.

 

అయితే, ఇదివరకు సీబీఐ దాఖలు చేసిన నాలుగు చార్జిషీట్లలో ఇవే అభియోగాలను కోర్టు తిరస్కరించకపోవడం గమనించవలసిన విషయమే. అందువల్ల, ఇప్పుడు ఇదే కారణంతో జగన్ మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న న్యాయవాదులు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించి, సీబీఐ కోర్టు తీర్పులో ఉన్న తేడాలను, లోపాలను కూడా ఎత్తి చూపి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయవచ్చును.

 

నేటి సిబిఐ కోర్టు తీర్పు జగన్ మోహన్ రెడ్డికి కొంత ఊరట కలిగించిందని చెప్పవచ్చును. ముఖ్యంగా సుప్రీంకోర్టు అతనికి బెయిలు తిరస్కరించిన తరువాత, తీవ్రనిరాశ నిస్పృహలలో కూరుకు పోయున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకి, సీబీఐపై దాడి చేసేందుకు స్వయంగా సీబీఐ కోర్టే ఒక గొప్ప ఆయుధం అందించినట్లయింది.

 

సీబీఐ మరియు ఈడీ శాఖలను కాంగ్రెస్ పెరట్లో కుక్కలని అభివర్ణించిన షర్మిల, ఇక నేటి నుండి సీబీఐపై తన దాడి మరింత తీవ్ర తరం చేయవచ్చును.