2020 బడ్జెట్ కేటాయింపులకు సర్వం సిధ్ధం...

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. గత ఏడాది తొలి సారిగా ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు రెండో సారి ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో అన్ని వర్గాల మెప్పు పొందేలా బడ్జెట్ ను రూపొందించడం కత్తిమీద సామే. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసేందుకు ఈ బడ్జెట్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు.

శనివారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో ఏయే రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు, ఎలాంటి ఉద్దీపనలు ప్రకటిస్తారు అనే అంశం ఆసక్తి రేపుతోంది. మౌలిక వసతుల రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. అలాగే పారిశ్రామిక వర్గాల వ్యక్తిగత పన్నుల భారాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ప్రారంభం కాబోయే క్యాబినెట్ భేటీలో ఈ అంశాలపై చర్చించనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏవైనా అమెండ్ మెంట్ బిల్లులు ఉన్నా వాటికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశ పెట్టడానికి వీలుగా వాటిని సిద్ధం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం పరిస్థితి ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ సారి బడ్జెట్ కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది.

ఆ మేరకు ఇప్పటికే బడ్జెట్ ఒక ముసాయిదా సిద్ధమైంది దానిని ఎల్లుండి  ప్రారంభమయ్యే పార్లమెంటు ఉభయ సభలలో (ఫిబ్రవరి 1) ఒకటో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టే ముందు మరొకసారి కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా దాన్ని ఆమోదించి పార్లమెంట్ లో దానిని ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సారి బడ్జెట్ లో ఎటువంటి అంశాలుండాలి, ఎటువంటి వడ్డింపులు ఉండాలి అనేది సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ ఈ సారి తమకేమైనా వెసులుబాటు లభిస్తుందనే ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఆర్థిక మాంద్యం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పన్ను వడ్డింపులు పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.