చికిత్స‌ అందక బాలుడి మృతి

ఉపాధి కోసం వలసొచ్చిన  పేద‌ కుటుంబాన్నికి లాక్‌డౌన్ శాపంగా మారింది. స‌రైన స‌మ‌యంలో చికిత్స చేయించుకోలేక క‌న్న కొడుకును కాటికి మోసుకెళ్లాల్సిన దుస్థితి ఆ పేద తండ్రికి క‌ల్గింది. 

కదిరికి చెందిన మనోహర్‌ ఐదేళ్లుగా అనంత‌పూరం జిల్లా గోరంట్లలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుడారంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. మనోహర్ తుక్కు కొనుగోలు షాపులో హమాలీగా పనిచేస్తున్నాడు. అనారోగ్యం బారిన పడిన కుమారుడికి సరైన వైద్యం చేయించలేని నిస్సహాయ పరిస్థితి ఎదురైంది. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయాడు. 

కొద్దిరోజులుగా మనోహర్ పెద్ద కొడుకు దేవాకు దగ్గు, జ్వరంతోపాటు గొంతు కింద గడ్డలు వచ్చాయి. ముందు స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స అందించారు. తర్వాత నయం కాకపోవడంతో గోరంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత హిందూపురం తీసుకెళ్లగా బాలుడి నోరు, ముక్కునుంచి రక్తం వస్తుండటంతో అనంతపురం పెద్దాసుపత్రి, కర్నూలు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. లాక్‌డౌన్‌తో పిల్లవాడిని అక్కడికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. అందుకే హిందూపురంలోనే వైద్యం చేయించాడు.. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.

చనిపోయిన పసివాడి అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేవు. గత్యంతరం లేక కుమారుడి శవాన్ని చేతులపై ఎత్తుకుని సమీపంలోని చిత్రావతి ఒడ్డున ఖననం చేశాడు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది.