బీజేపీలోకి సత్తిబాబు అండ్ కో?

 

 

 

పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై రోజుకో రూమర్ వస్తోంది. ఈసారి పోటీ ఎక్కడోనని రకరకాల ప్రచారం జరగ్గా నేడు ఆయన ఏకంగా పార్టీయే మారిపోతున్నారన్న ప్రచారం చోటు చేసుకుంది. బీజేపీలో చేరుతారని, కుటుంబ ప్యాకేజీలో సీట్ల కోసం బేరసారాలు సాగిస్తున్నారని విజయనగరం జిల్లాలో ఒకటే చర్చ. ఇవన్నీ వదంతులేనని కొంతమంది తేలికగా తీసుకోగా, లోపాయికారీగా ఏదో జరుగుతోందని మరికొంతమంది చెబుతున్నారు. ప్రజాదరణ, అనుచరగణాన్ని కోల్పోయిన బొత్స సత్యనారాయణ పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉంది.

 

తనతో పాటు పదిహేనేళ్లుగా నడిచిన నాయకులు, కార్యకర్తలు కనీసం పట్టించుకోవడం లేదు. రోజుకొకరు జారిపోతున్నారు. చెప్పాలంటే కాంగ్రెస్ రాజకీయాల్లో ఒంటరైపోతున్నారు. తన కుటుంబానికి చెందిన ప్రజాప్రతినిధులు, మరో ఐదేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తప్ప మరెవరూ ఆయనతో  ఉన్నట్టు కనిపించడం లేదు.  దీంతో  ఆయన దయనీయ పరిస్థితి  ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. శృంగవరపుకోటలో పోటీ చేస్తారని ఒకసారి, చీపురుపల్లిలో అని మరోసారి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి  అని ఇంకోసారి ప్రచారం జరిగింది. విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని మరో వాదన వినిపించింది. కానీ ఆయన నోరు విప్పిన పాపన పోలేదు. తన రాజకీయ భవిష్యత్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో  బీజేపీలో చేరుతున్నారని బొత్సపై కొత్త ప్రచారం మొదలైంది.



ఇదే సమయంలో బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిచ్చాయి. బొత్స సత్యనారాయణ తమ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్న మాట ఆయన తెలిపారు. కొన్నికారణాల వల్ల సినీ నటుడు మోహన్‌బాబు పార్టీలోకి రాకుండా ఆగిపోయారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.