మళ్ళీ మళ్ళీ ఆయనే గెలవాలని ప్రజలు కోరుకొంటున్నారుట

 

మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు చీపురుపల్లిలో నామినేషన్ వేసారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో జిల్లా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్న ఆయన, అందరూ అనుకొంటునట్లుగా తన పట్ల ప్రజలలో ఎటువంటి వ్యతిరేఖత లేదని నిరూపించేందుకన్నట్లుగా ఈ సందర్భంగా భారీ ఊరేగింపుతో తరలివెళ్లి చాలా అట్టహాసంగా నామినేషన్ వేశారు.

“గత పదేళ్లుగా నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా జిల్లా ప్రజల సేవలోనే ఉన్నాము. చీపురుపల్లి నియోజక వర్గంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పటిన సంగతి ప్రజలకు తెలుసు. నేను ఎక్కడి వాడినని ఎవరయినా ప్రశ్నిస్తే, చీపురుపల్లి వాడినని గర్వంగా చెప్పుకొంటాను. నేను నా కుటుంబ సభ్యులు అందరూ ఎల్లపుడూ కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తుంటాము. అందుకే ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ నేనే కావాలని ఓటేసి గెలిపించుకొంటున్నారు. నాకు ఓటేసి గెలిపించిన నా అక్కలు, చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా నేను శిరసు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈసారి కూడా మీరందరూ మళ్ళీ నాకే ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలలో చేరినవారు కొంతమంది చాలాచాలా గొప్పమాటలు, వాగ్దానాలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకే ద్రోహం చేసిన వారికి ప్రజలు ఓటేసి గెలిపిస్తే రేపు వారు ప్రజలను మాత్రం మోసం చేయరని నమ్మకం ఏమిటి? అందువలన ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది,” అని బొత్స అన్నారు.

 

ఒకప్పుడు విభజన జరిగితే తప్పేమిటి? అని ప్రశ్నించిన  బొత్స సత్యనారాయణ, ఆ తరువాత సమైక్య ఉద్యమం జోరందుకొన్నపుడు, తాను విభజనను వ్యతిరేఖిస్తున్నాని అన్నారు. అనడమే కాకుండా నాటి  ముఖ్యమంత్రి కిరణ్ తయారుచేసిన వినతి పత్రం మీద అందరితో బాటు సంతకం కూడా చేసారు. కానీ మళ్ళీ ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు పసిగట్టగానే ఆయన తన దూకుడు తగ్గించుకొని విభజన వ్యవహారంలో అధిష్టానందే అంతిమ నిర్ణయమని దానిని అందరూ శిరసావహించాల్సిందే అంటూ వాదించారు.

 

కానీ తనను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవి నుండి తప్పించిన తరువాత, పార్టీ మారబోతున్నట్లు మీడియా లీకులిచ్చారు. మళ్ళీ  ఇప్పుడు తన కుటుంబంలో అందరికీ పార్టీ టికెట్స్ కేటాయించడంతో, పార్టీ వదిలినవారు ద్రోహులని అంటున్నారు. రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తున్న ప్రజలకు, సీమాంధ్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కే ఓటేయాలని ఆయన కోరుతున్నారు. ఏది ఏమయినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడిపోయినా బొత్స మాత్రం తప్పకుండా గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.