కేసీఆర్, మోదీ చెప్పేవన్నీ అబద్దాలే

 

నిర్మల్‌ జిల్లా భైంసాలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కేసీఆర్, మోదీపై విమర్శలు గుప్పించారు. పంటలకు మద్దతు ధర రాక, వ్యవసాయ కష్టాలతో తెలంగాణలో వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, పంటలకు మద్దతు ధర పెంచుతామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు.. రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని రాహుల్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు ఇచ్చారా?.. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్నారు, కట్టించారా?.. ముస్లింలకు 12 శాతం రిజర్వేష్లు ఇస్తామన్నారు, ఇచ్చారా?.. ఇంటింటికి నల్లా వచ్చిందా?.. అంటూ రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆదివాసీల కోసం పోరాడిన కొమరం భీం స్ఫూర్తిని, దళితుల కోసం నిలబడిన అంబేద్కర్ స్ఫూర్తిని గుర్తుచేసుకుందామని రాహుల్ అన్నారు. దేశమంతా అంబేద్కర్ ను స్మరిస్తుంటే ఇక్కడి సీఎం అవమానిస్తారని కేసీఆర్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ పేరుతో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్ట్ కు కాళేశ్వరమంటూ పేరు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేశారని రాహుల్‌ మండిపడ్డారు. నీరు, భూమి, అడవిపై ఆదివాసీల హక్కులు రక్షించాలని యూపీఏ చట్టం తెచ్చిందని, దీని ప్రకారం మార్కెట్‌ రేటు కంటే నాలుగురెట్ల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ చెప్పిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అయితే తెలంగాణలో ఆ భూసేకరణ చట్టాన్ని కేసీఆర్‌ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేసీఆర్‌కు మోదీ అండగా నిలిచారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాటి ప్రసావనేది?.. పంటకు కనీసం మద్దతు ధర దక్కుతోందా?.. అని రాహుల్ మండిపడ్డారు. కేసీఆర్, మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనని, జనం సమస్యలతో రాజకీయం చేయాలని చూస్తున్నారని రాహుల్ అన్నారు.