చంచల్ గూడా జైలు బాటపట్టిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరుడు

 

గత కొద్ది రోజులుగా తెలుగు దేశం పార్టీ నుంచి బయటకి వెళ్ళే ఆలోచన చేస్తున్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు గురువారంనాడు దైర్యం చేసి చంచల్ గూడా జైలుకి వెళ్ళిపోయారు. జగన్ మోహన్ రెడ్డిని కలుసుకొని వచ్చిన తరువాత మీడియా వారితో మాట్లాడుతూ, చంద్రబాబు వైఖరి నచ్చనందునే తానూ పార్టీ వీడుతున్నానని, జగన్ మోహన్ రెడ్డితో మనసు విప్పి అన్ని మాట్లాడుకొ న్నట్లు, చంద్రబాబుతో మాట్లాడే అవకాశం తనకు ఎప్పుడు కలుగలేదని అన్నారు.

 

అయితే, తెలుగు తమ్ముళ్ళు మాత్రం అతని మీద చాలాగుర్రుగా ఉన్నారు. పార్టీలో కీలకపదవులిచ్చి గౌరవించినప్పటికీ పార్టీపట్ల కానీ, పార్టీ అధినేతపట్ల గానీ కనీస విశ్వాసం కూడా చూపకుండా, జగన్ ఆఫర్ చేసిన డబ్బుకు అమ్ముడుపోయాడని తీవ్రవిమర్శలు చేసారు. గతంలో, తెలుగుదేశం పార్టీ హయాములో ఆయనకి కీలకమయిన రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్ష పదవిని చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి కూడా బొడ్డు భాస్కరావే ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. 2009 సం.లో పార్టీ పరాజయం పాలయిన తరువాత కూడా, ఆయన అదే స్పూర్తితో, అంకిత భావంతో పార్టీకి సేవచేసినందున శాసనమండలికి పంపడం జరిగింది.

 

అయినప్పటికీ, ఆయన ఈవిధంగా పార్టీకి ద్రోహం చేసి జగన్ గూటికి చేరడం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం జగన్ ఆశ చూపిన డబ్బుకి, శాసన సభ టికెట్టుకి ఆశపడి పార్టీకి ద్రోహం తలబెట్టాడని ఆరోపిస్తున్నారు. ఆయన జగన్ను కలిసేందుకు జైలుకి వెళ్ళినట్లు తెలియగానే, ఆయను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా వెలువడ్డాయి.