బ్లడ్‌గ్రూపే తెలియని బ్రిటన్ ప్రజలు

 

సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించామని బ్రిటన్‌ దేశస్థులు మురిసిపోతూ ఉండవచ్చుగాక! కానీ అమాయకత్వంలో మాత్రం వారు ప్రపంచంలో ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకున్నారు. తాజాగా జరిగిన ఒక సర్వేలో తమ ఆరోగ్యానికి సంబంధించిన మౌలికమైన విషయాలు కూడా తెలియవంటూ నాలుక కరుచుకున్నారు. ఆ నివేదిక ఇదిగో...

 

హెల్త్‌స్పాన్‌ అనే సంస్థ, తన పరిశోధనలో భాగంగా బ్రిటన్‌లోని రెండువేల మంది పెద్దలని ఓ పది ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలన్నీ కూడా ఎవరో వైద్యవిద్యార్థులకు సంబంధించినవి కావు. ఒక వ్యక్తికి తన ఆరోగ్యం గురించి ఎంతవరకు తెలుసు అన్న విషయాలకు సంబంధించినవే! కానీ చాలామంది వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ సరైన సమాధానం చెప్పేలేకపోయారట. ఉదాహరణకు-

 

- సర్వేలో పాల్గొన్న సగానికి సగం మందికి తమ బ్లడ్‌గ్రూప్‌ ఏమిటో తెలియదట!

 

- ఒక 68 శాతం మంది తమ గుండె పనితీరు సవ్యంగానే ఉందని భావిస్తున్నారు. ఇక ఓ 42 శాతం మందికైతే మెరుగైన గుండె కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియదు.

 

- 16 శాతం మంది అభ్యర్థులకు తమకు వంశపారంపర్యంగా ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందో అన్న అవగాహన లేదు.

 

- ఓ 35 శాతం మంది తమ జీవితంలో ఎప్పుడూ వైద్య పరీక్షలు చేయించుకోలేదని చేతులెత్తేశారు.

 

- సర్వేలో పాల్గొన్న జనాభాలో చాలామందికి కొలెస్ట్రాల్‌ పరిమితుల గురించి కానీ, ఆరోగ్యకరమైన రక్తపోటు గురించి కానీ ఆలోచనే లేదు. పైగా వీటివల్ల ఏదన్నా ప్రమాదం ఏర్పడితే అప్పుడే చూసుకోవచ్చులే అని ఓ 44 శాతం మంది భావిస్తున్నారు కూడా!

 

- కొంతమంది అభ్యర్థుకి 47 ఏళ్లు వచ్చిన తరువాత కానీ తమ జీవనవిధానంలో ఏమన్నా మార్పులు ఉండాలేమో అన్న ఆలోచన రావడం లేదు.

 

ఇక కొంతమందికి రోజుకి ఎంత మంచినీరు తాగాలో కూడా తెలియకపోతే, మరికొందరేమో తమకి ఏమన్నా తేడా చేసినప్పుడు కూడా జీవన విధనంలో ఎలాంటి మార్పులనూ చేయం అని కుండబద్దలు కొట్టేశారు.

 

ఇలాంటి అజ్ఞానం నిజంగా ప్రాణాంతకం అంటున్నారు సర్వే చేపట్టిన పరిశోధకులు. 40 ఏళ్ల వయసు వచ్చిన తరువాత అన్ని రకాల వైద్య పరీక్షలనీ చేయించుకుంటేనే మేలని సూచించారు. సమస్యలు మరీ జటిలం అయితే తప్ప మర ఆరోగ్యాన్ని పట్టించుకోమనీ, దానివల్ల గుండె వంటి ముఖ్యమైన శరీర భాగాలను తీరని నష్టం జరిగిపోయే ప్రమాదం ఉందనీ హెచ్చరిస్తున్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరిమితులు, డి విటమిన్‌ ఆవశ్యకత వంటి విషయాల మీద అవగాహన ఉంటే సమస్య మొదలవకముందే దానిని నివారించవచ్చునని సూచిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఎలాంటి వైద్య పరీక్షలూ చేయించుకోకుండా ఉండి ఉంటే కనుక, తక్షణమే రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటి పరీక్షల కోసం వైద్యడి దగ్గరకు బయల్దేరమని తొందరపెడుతున్నారు. లేకపోతే ఇవి నిదానంగా మన శరీరాన్ని దెబ్బతీసి, ముప్పు తలపెడతాయి. ఈ సూచనలు కేవలం బ్రిటన్ వాసులకే కాదు, మనకు కూడా ఉపయోగపడతాయి కదా!

 

 

- నిర్జర.