గుజరాత్ ఎన్నికల్లో మోడీ హాట్రిక్

BJP wins in Gujarat assembly polls, BJP wins in Gujarat, narendra modi gujarat, narendra modi Gujarat assembly polls

 

 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడో సారి మోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 116 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 60 స్థానాలు, జీపీపీ రెండు, ఇతరులు నాలుగు స్థానాలను గెలుచుకున్నారు. గురువారం ఉదయం రాష్ట్రంలోని 33 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 1,666 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.


మణినగర్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 85వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో మోడీ విజయం సాధించారు. ఆయన కుడి భుజంగా చెప్పుకునే మాజీ హోంమంత్రి అమిత్ షా నరన్‌పూర్ నియోజకవర్గంలో గెలుపొందారు. మరోవైపు బీజేపీ నుంచి విడిపోయి బీపీపీ పార్టీ స్థాపించిన కేశుభాయ్ పటేల్ విశవదర్‌లో గెలుపొందారు.



తనను గెలిపించి గుజరాత్ ప్రజలు ఉజ్వల భవిష్యత్తుకు మరోసారి పట్టం గట్టారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. విజయం సాధించిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మరోసారి పట్టం గట్టినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ ఉజ్వల భవిష్యత్తుకు తాను కృషి చేస్తానని వాగ్ధానం చేశారు.



నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని మోడీ తల్లి హీరాబెన్ అన్నారు. ఇవాళ ఆమె మోడీ విజయం సాధించిన సందర్భంగా మాట్లాడారు. తన కొడుకు పీఎం అవుతారన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోడీ దేశానికి చేయాల్సింది చాలా ఉంది అని వ్యాఖ్యానించారు. కాగా, మోడీ ప్రధాని కావాలని చాలా మంది కోరుకుంటున్నారని మోడీ సోదరుడు పంకజ్ మోడీ తెలిపారు.