తెలంగాణ రాజకీయాలపై అమిత్‌షా ఆరా

 

2014 సాధారణ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయ ఘంటిక మోగించింది.దేశంలో 22 రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేసిన కమలనాథులు దక్షిణాదిలోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల కార్యాచరణ రూపొందిస్తున్నారు.రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని భాజపా ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.ఈ నెల 10న కమలనాథులు కరీంనగర్‌లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు అమిత్‌షా హాజరు కానున్నారు. తెలంగాణలో ముమ్మర ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర ప్రముఖులను సభలకు రప్పించేందుకు స్థానిక నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయటంతో పాటు తెలంగాణ ప్రజలు, అమరుల ఆకాంక్షలు ప్రతిబింబించేలా మేనిఫెస్టో రూపకల్పనకు సామాజిక వేత్తలు, మేధావులు, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోంది.