మదనపల్లెలో బీజేపీ పోటీ?

 

 

 

చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి? టీడీపీనా.. లేక బీజేపీనా? ఈ విషయమై గందరగోళం నెలకొంటోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానాన్ని కమలానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలియడంతో టీడీపీ వర్గాలు కాస్త డీలా పడ్డాయి. బీజేపీ తరఫున భారతీయ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి చల్లపల్లె నరసింహా రెడ్డికి మదనపల్లె టికెట్టు ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో దీనిని అంగీకరిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీతో చల్లపల్లెకు మంచి అనుబంధం ఉంది.

 

దీంతో సీట్ల సర్దుబాటు అంటూ జరిగితే చల్లపల్లెకు మదనపల్లె కేటాయించడం ఖాయమని అంటున్నారు. దీనికి తోడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మదనపల్లె విషయంపై మౌనంగా ఉన్నారు. బీజేపీకి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నందునే మదనపల్లె ప్రస్తావన తేవడం లేదనే అనుమానాలు దేశం నేతల్లో ఉన్నాయి.