కమలం - సైకిల్ సీట్ల బేరాలు

 

 

 

తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య పొత్తు విషయం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చేయడంతో ఇక సీట్ల సర్దుబాటు గురించిన బేరసారాలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నా, ఆయన మాత్రం తనకు సీట్లు అక్కర్లేదని, తాను చెప్పిన విధానాలను మేనిఫెస్టోలో పెట్టి, అమలుచేస్తే చాలని అంటున్నట్లు సమాచారం. ఇక బీజేపీ మాత్రం తనకు రెండు రాష్ట్రాల్లో కలిపి 16 ఎంపీ సీట్లు, 75 అసెంబ్లీ స్థానాలు అడుగుతోందట. తెలంగాణాలో 8 ఎంపీ, 50 అసెంబ్లీ సీట్లు... ఆంధ్రప్రదేశ్‌లో 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు కోరుతున్నారు. కానీ తెలుగుదేశం నేతలు మాత్రం ఇందుకు అబ్బే అనేస్తున్నారు. 2004 ఎన్నికల్లో పొత్తు సమయంలో బీజేపీకి మొత్తంగా ఆరు ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇప్పుడు కూడా అంతకు మించి ఇవ్వలేమని చెబుతున్నారు.


టీడీపీ ఇంతగా బెట్టు చేయడానికి కూడా కారణం ఉంది. బీజేపీ వల్ల తాము పెద్దగా పొందబోయే ఎన్నికల లబ్ధి ఏమీ ఉండబోదని, రేపు కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావాలంటే వాళ్లకు ఎంపీల సంఖ్య, మద్దతు అవసరం కాబట్టి వాళ్లకే తమ అవసరం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. బీజేపీకి సొంతంగా నెగ్గగల సామర్థ్యం ఇక్కడ లేదు కాబట్టి, తాము చెప్పినట్లుగా వింటే, రేపు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో తమకూ ఎంతో కొంత పాత్ర ఉంటుందని వాళ్లు అనుకుంటున్నారు.