శారదా చిట్‌ఫండ్.. మమతనీ విచారించాలి: అమిత్ షా

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాత్ర కూడా ఉంటే ఆమెను కూడా విచారించాల్సిందేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ స్కామ్‌లో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదన్నారు. కోల్‌కతాలో భారతీయ జనతాపార్టీ సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా పై విధంగా వ్యాఖ్యానించారు. శారదా చిట్ ఫండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ కునాల్ ఘోష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాలంటే శారదా చిట్ ఫండ్ అధినేత సుదీప్త సేన్‌తో పాటు తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా విచారించాల్సి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.