వేడెక్కిన మహారాష్ట్ర రాజకీయం.. ఊహించని కొత్త మలుపులు!!

 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే సీఎం పదవి కోసం పట్టుబడుతున్న శివసేనకు బిజెపి నేతలు కొత్త ఆఫర్ ఇచ్చారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పదమూడు మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. సీఎం పదవితో పాటు ఇరవై ఆరు మంత్రి పదవులను బిజెపి తీసుకుంటోదని చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నివాసంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ప్రతిపాదనలు తెచ్చారు. సీఎం పదవిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని బిజెపి నేతలు స్పష్టం చేశారు. 

రేపు ఉద్ధవ్ థాక్రే నివాసంలో శివసేన ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్దవ్ థాక్రే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించాలని అనుకుంటోంది. శివసేన హ్యాండ్ ఇస్తే బీజేపీ మరొక ప్లాన్ కి కూడా సిద్ధం అయ్యింది. బీజేపీ టికెట్లు రాక రెబల్స్ గా పోటీ చేసిన పదిహెడు మంది స్వతంత్రులుగా విజయం సాధించారు. ఇప్పుడు వారందరినీ ఫడ్నవీసు మచ్చిక చేసుకుంటున్నారు. అదే సమయంలో నలభై ఐదు మంది శివసేన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బిజెపి ఎంపి సంజయ్ కాకడే ఓ బాంబు పేల్చారు. 

కాగా కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు నిజంగానే తమ పార్టీ అధినేత పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన ఆదిత్య థాక్రే కోసం బీజేపీతో కయ్యం పెట్టుకోవటం వారు వ్యతిరేకిస్తున్నారని అందుకే అవసరమైతే జంప్ చెయ్యడానికి కూడా సిద్ధం అవుతారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అయితే శివసేన కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంటే కాంగ్రెస్ ఎన్సీపీ మద్దతిస్తాయని వార్తలు కూడా ముంబైలో హల్ చల్ చేస్తున్నాయి.ఇక మహారాష్ట్రా రాజకీయాలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి.