చంద్రబాబుకి డబ్బులిస్తే అధికారులను కోర్టుకి ఈడుస్తాం

 

బీజేపీ నేత జీవీఎల్ నర్సింహా రావు మరోసారి టీడీపీ మీద విమర్శల దాడి చేసారు. టీడీపీ నేతలు చర్చల పేరుతో రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి తదితర అంశాలపై చర్చలకు రావాలని తమకు సవాల్ చేయడం, తీరా తమకు వచ్చాక పారిపోవడం టీడీపీ నేతల వంతుగా మారిందని విమర్శించారు. తాము సవాల్ చేయడం లేదని, టీడీపీ నేతలే సవాల్ చేసి, మేం సిద్ధంగా ఉన్నామంటే పోలీసుల సాయంతో పారిపోవడం ఏమిటన్నారు. ఇలాంటి చచ్చు సవాళ్లు చేతకాకుంటే మానుకోవాలని హితవు పలికారు. తమ పార్టీ ఎమ్మెల్యే మాణిక్యాల రావును నిన్న చర్చలకు పిలిచి, ఆ తర్వాత టీడీపీ నేతలు పోలీసులను అడ్డు పెట్టుకొని పారిపోయారన్నారు. ఛాలెంజ్ చేసేది మీరేనని, అలాగే పారిపోయేది మీరేనని, ఇలాంటి పిరికిపందలు ఎలా పరిపాలన చేస్తారని ప్రశ్నించారు. సవాల్ విసిరి, పోలీసుల సాయంతో వెళ్లిపోతారని, ఇదేమి సవాల్ అన్నారు.

గతంలో సుజనా చౌదరి చేసిన సవాల్‌కు తాను ఇరవై నిమిషాలలో ముందుకు వస్తే, ఆయన మాత్రం ఆ తర్వాత గొంతు బాగాలేదని పారిపోయారన్నారు. లోకేష్‌తో చర్చకు రావాలని కూడా టీడీపీ నేతలు చెప్పారని, తాను సిద్ధమయ్యాక స్థాయి తక్కువ స్థాయి నేతలతో లోకేష్ చర్చకు రారని చెప్పి వెనక్కిపోయారన్నారు. కానీ లోకేష్ స్థాయి ఏమిటని ఎద్దేవా చేశారు. ఇక్కడ అందరూ సమానమే అన్నారు. టీడీపీ నేతలు చచ్చు సవాళ్లు విసిరి చీప్‌గా పోరిపోవద్దని హితవు పలికారు. మాణిక్యాల రావును చర్చలకు పిలిచి, హౌస్ అరెస్ట్ చేశారని, తాము అతనిని పరామర్శించేందుకు వెళ్తే పోలీసులు అఢ్డుకున్న తీరు దారుణం అన్నారు. తమను అడ్డుకున్న తీరు చూస్తుంటే అధికార పార్టీకి చెమటలు పట్టించినట్లుగా అర్థమవుతోందన్నారు.

చంద్రబాబు రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా వదిలేసినట్లుగా ఉందని విమర్శించారు. ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకొని, ఆయన పూర్తి సమయం పార్టీ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారన్నారు. చంద్రబాబు చేసే విలాస ప్రయాణాలకు ప్రజల సొమ్మును వినియోగిస్తున్నారని ఆరోపించారు. మీరు బెంగళూరు, చెన్నై, ఢిల్లీలకు ఎక్కడికి అయినా వెళ్లవచ్చునని, కానీ ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తే, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయడమే అన్నారు. టీడీపీ రాజకీయాలకు ప్రజల సొమ్మును ఎందుకు ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. ఓ వైపు ధర్మపోరాటం పేరిట దొంగ పోరాటాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మీరు ఎవరితో కలిసినా, ఎక్కడికి వెళ్లినా తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ వేలకోట్లు ఉన్న చంద్రబాబు సొంతగా ఖర్చు పెట్టుకోవాలన్నారు. రాజకీయ కార్యక్రమాల కోసం సీఎంకి డబ్బులు ఇస్తే అధికారులు కూడా బాధ్యులు అవుతారని జీవీఎల్ హెచ్చరించారు. అలాంటి అధికారులను కోర్టులకు ఈడుస్తామని, వారిని వదిలి పెట్టేది లేదన్నారు. అధికార కార్యక్రమాలు ఉంటేనే ప్రజాధనం వినియోగించాలన్నారు. ఇలాంటి అంశాలను అవసరమైతే కోర్టుకు తీసుకెళ్తామన్నారు.