యడ్యూరప్పకి మొదలైన తిప్పలు.. కమలం ఖాతా నుండి కర్ణాటక కూడా ఔటా?

కర్ణాటక బీజేపీ సర్కారుపై అసంతృప్తి మొదలైంది. ఉప ఎన్నికల్లో గెలిచిన రెండు నెలలకే ఎమ్మెల్యేలు రహస్య భేటీలు పెట్టుకోవటం కలకలం రేపుతోంది. సీఎం యడ్యూరప్ప పని తీరుతో పాటు ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణపై ఎమ్మెల్యేలు ఆనందంగా లేరని సమాచారం. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఏడాది పాటు పాలన సాగించిన కాంగ్రెస్ జెడియు సంకీర్ణాన్ని గద్దె దించి ముఖ్యమంత్రైన యడ్యూరప్పకు అప్పుడే కష్టాలు మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచి అరవై రోజులు కాకముందే ఎమ్మెల్యేలు రహస్య భేటీలు పెట్టుకుంటున్నారు. సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర సూపర్ సీఎం గా వ్యవహరిస్తున్నారని మెజారిటీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణ కూడా అగ్నికి ఆజ్యం పోసింది. పార్టీని ఫిరాయించి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మందికి మంత్రి పదవులు దక్కడాన్ని మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎనిమిది సార్లు గెలిచిన ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి గ్యారెంటీ అని చెప్పి చివరి నిమిషంలో మొండి చేయి చూపారనే వాదన వినిపిస్తోంది. 

మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఇంట్లో జరిగిన ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ లో సీఎం పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. మరోవైపు యడ్యూరప్ప వర్గీయుల సృష్టిగా చెబుతున్నా సంతకం లేని లేఖ గురించి కూడా చర్చ జరుగుతోంది. యడ్యూరప్పకి వయసు మీద పడింది అని వారసుడిగా విజయేంద్రకు పగ్గాలు ఇవ్వవలసిన సమయం వచ్చేసింది అనేది ఆ లేఖ సారాంశం. కాంగ్రెస్ మార్క్ అయిన వంశపారంపర్య రాజకీయాలకు బిజెపిలో చోటు లేదని ఓ వైపు కేంద్ర నాయకత్వం చెబుతుంటే యడ్యూరప్ప అందుకు విరుద్ధంగా కొడుకును ప్రోత్సహించే ప్రయత్నం చేయటం ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. బడ్జెట్ సెషన్ మొదలైన తొలి రోజే సీక్రెట్ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యేలు ముందుముందు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బిజెపిలో పరిణామాలని బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటికే సీఎల్పీ భేటీ నిర్వహించింది. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు మాజీ సీఎం సిద్దరామయ్య.